80 కేజీల బంగారం మాయంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం మాయమైన ఘటనలో సీబీఐ విచారణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు 80 కేజీల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకు స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని వెనుక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు.