
‘నల్ల’ధనులపై కరుణ లేదు
నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసి, చట్టబద్ధ ఆదాయం/ఆస్తులుగా మార్చుకునే అవకాశం కల్పించడమంటే నల్లధనం దాచుకున్నవారిపై కరుణ చూపడం కాదని కేంద్ర మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు.
నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశంపై జైట్లీ
న్యూఢిల్లీ: నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసి, చట్టబద్ధ ఆదాయం/ఆస్తులుగా మార్చుకునే అవకాశం కల్పించడమంటే నల్లధనం దాచుకున్నవారిపై కరుణ చూపడం కాదని కేంద్ర మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. వారికి 45 శాతం వసూలు చేయనున్నామని, ఈ అవకాశం కూడా కొంతకాలమేనన్నారు. బడ్జెట్ అనంతర భేటీల్లో భాగంగా జైట్లీ బుధవారం పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. దేశీయంగా వెల్లడించని ఆదాయం, ఆస్తులు ఉన్నవారికి.. వాటిని బహిర్గతం చేసేందుకు జూన్ 1 నుంచి నాలుగు నెలల అవకాశం కల్పిస్తామన్నారు. ‘ఆ ఆదాయం/ఆస్తులకు సంబంధించి 30 శాతం పన్నుతోపాటు 7.5 శాతం జరిమానా, మరో 7.5 శాతం సర్‌చార్జీ కింద వసూలు చేస్తాం.’ అని చెప్పారు. అయితే 1997లో ఇలాగే నల్లధనాన్ని చట్టబద్ధ ఆదాయంగా మార్చుకునే అవకాశం ఇవ్వగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ. 10 వేల కోట్లు సమకూరాయి.
ఎయిర్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో ఎవరినీ వదలం
మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం దుమారం చెలరేగింది. ఎయిర్‌సెల్ - మాక్సిస్ ఒప్పందంలో మరిన్ని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 2జీ స్కాంతో సంబంధం ఉన్న ఈ వ్యవహారంలో కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని ఏఐఏడీఎంకే చేసిన డిమాండ్ మేరకు సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, పాలకపక్ష సభ్యులమధ్య వాగ్యుద్ధం జరిగింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో ఎవరినీ వదలమని ప్రభుత్వం తెలిపింది.