
'ఆధార్'పై జైట్లీ-ఏచూరి హోరాహోరీ!
న్యూఢిల్లీ: మొదటి దఫా బడ్జెట్ సమావేశాల చివరి రోజైన బుధవారం ఆధార్ బిల్లుపై రాజ్యసభ అట్టుడికింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, సీపీఎం నేత సీతారాం ఏచూరి తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పెద్దలసభ వేడెక్కింది. ఆధార్ బిల్లును లోక్‌సభలో ద్రవ్యబిల్లుగా ఆమోదించడంలో ప్రభుత్వం ఉద్దేశమేమిటో వెల్లడించాలని ఏచూరి డిమాండ్ చేశారు. ఆధార్ బిల్లు వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘిస్తుందా? అనే విషయాన్ని ఐదుగురు సభ్యుల పార్లమెంటు ప్యానెల్ పరిశీలిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించజాలదని ఆయన పేర్కొన్నారు. ఏచూరి వాదనకు జైట్లీ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. 'ప్రైవసీ కచ్చితమైన హక్కు కాదు. ప్రైవసీ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. దీనికి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి. చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా దీనికి ఆంక్షలు విధించవచ్చు' అని జైట్లీ పేర్కొన్నారు.
'మీరు నన్ను విమర్శిస్తే.. భావప్రకటనా స్వేచ్ఛా? అదే నేను మిమ్మల్ని విమర్శిస్తే.. అది నా అసహనమా' అని జైట్లీ ప్రశ్నించారు. ఆధార్ బిల్లును సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నందునా.. ఇది లెజిస్లేటివ్ అధికార పరిధిలోకి రాదని ఏచూరి పేర్కొనగా.. ప్రజాస్వామ్యంలో ఇది అసంబద్ధమైన వాదన అని, కోర్టుకు కేవలం జ్యుడీషియల్ సమీక్ష అధికారాలు మాత్రమే ఉంటాయని జైట్లీ బదులిచ్చారు.
ఆధార్ బిల్లును లోక్‌సభలో ద్రవ్యబిల్లుగా ప్రభుత్వం ఆమోదించింది. లోక్‌సభలో తమకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యబిల్లును రాజ్యసభ కచ్చితంగా చర్చించాల్సి ఉంటుంది. ఒకవేళ చర్చించకున్నా ఇది ఆటోమేటిక్‌గా రాజ్యసభ ఆమోదం పొందినట్టు భావిస్తారు. రాజ్యసభలో ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీలో ఉండటంతో కేంద్రం ఈ ఎత్తు వేసింది. అయితే, రాజ్యసభ ఈ బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదిస్తూ లోక్‌సభకు పంపింది. ఈ సవరణలను ఆమోదించే, తిరస్కరించే అధికారం లోక్‌సభకు ఉంటుంది.