ప్రభుత్వ ఏర్పాటుపై తేల్చని పీడీపీ, బీజేపీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ, 25 సీట్లతో రెండో స్థానంలో ఉన్న బీజేపీ వరుసగా రెండోరోజూ ప్రభుత్వ ఏర్పాటుపై తేల్చలేదు. బుధవారం ఇరు పార్టీల నాయకత్వాలు వేర్వేరుగా సమావేశమైనా.. తమ ముందున్న అవకాశాలను బహిర్గతపరచలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన, ప్రధాని మోదీ సమక్షంలో ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
మూడు, నాలుగు రోజుల్లో జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పర్యవేక్షించేందుకు వీలుగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్‌లను పరిశీలకులుగా శ్రీనగర్ పంపాలని నిర్ణయించారు. మరోవైపు పీడీపీ అగ్రనేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్, పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సహా ఇతర నాయకులు శ్రీనగర్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటులో పొత్తులపై చర్చించారు. హిందుత్వ ఎజెండాతో సంఘ్ పరివార్ ముందుకెళ్తుండడంతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకించి కశ్మీర్ లోయలో ఎలా ఉంటుందని పీడీపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలనూ చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటులో ముందుండాలని అందరూ అధినాయకత్వాన్ని కోరారు.
సీఎం పదవికి ఒమర్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత పీడీపీ, బీజేపీలపైనే ఉందన్నారు. ఈ విషయంలో తాము వేచి చూసే ధోరణి అవలంబిస్తామన్నారు.
కశ్మీర్‌లో కొనసాగుతున్న సస్పెన్స్
Published Thu, Dec 25 2014 4:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement