న్యూఢిల్లీ: ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అశువులు బాసిన పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు వరించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉడీ ప్రాంతానికి చెందిన మన్జూర్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడు. అసాధారణ ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు మన్జూర్‌కు శౌర్య చక్ర అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
కాగా, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు 2017లో సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో మన్జూర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన మన్జూర్ ఇంటి చుట్టూ పేలుడు పదార్థాలను అమర్చాడు. అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా మన్జూర్ తప్పించుకున్నాడు. అప్పటికే ఇంటి చుట్టూ దాదాపు సగం భాగం వరకు పేలుడు పదార్థాలు అమర్చిన మన్జూర్.. మిలిటెంట్లు కాల్పులు విరమించాక మిగతా భాగంలో కూడా అమర్చాడు. రెండోసారి బాంబులను అమర్చే క్రమంలో ఉగ్రవాదులు మన్జూర్‌పై మరోసారి కాల్పుల వర్షం కురిపించారు. తూటాలు దిగినా చివరి క్షణం వరకు తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను అమర్చాడు. ఈ క్రమంలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment