బీజేపీలో జనతా పార్టీ విలీనం
రాజ్‌నాథ్ సమక్షంలో స్వామి ప్రకటన
న్యూఢిల్లీ: సుబ్రమణ్య స్వామి నేతృత్వంలోని జనతా పార్టీ ఆదివారం బీజేపీలో విలీనమైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వామి తన పార్టీని కాషాయ దళంలో కలిపేశారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, ఆ పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీల సమక్షంలో ఆయన ఈమేరకు ఢిల్లీలో ప్రకటన చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, జాతి ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దేశానికి మంచి భవిష్యత్తు అందించేందుకు బీజేపీతో కలిసి పనిచేస్తానన్నారు.
విలీనానికి ముందు రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో స్వామి బీజేపీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకర్లతో మాట్లాడుతూ.. జనతా పార్టీ విలీనంతో బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతాలకు గట్టి మద్దతు పలికే స్వామి గతంలో జన సంఘ్‌లో పనిచేశారు. ఐదు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా విధులు నిర్వహించారు. 2జీ కుంభకోణాన్ని వెలికితీయడంలో కీలక పాత్ర పోషించారు.