మోడీతో జయలలిత భేటీ
ప్రధానితో మొదటిసారి సమావేశమైన తమిళనాడు సీఎం
న్యూఢిల్లీ: శ్రీలంకలో తమిళ జాతీయులపై జరిగిన మారణకాండను ఖండిస్తూ ఐక్య రాజ్య సమితిలో భారత్ ఒక తీర్మానం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత డిమాండ్ చేశారు. ఆ జాతి హత్యాకాండకు కారణమైనవారిని బాధ్యులుగా గుర్తించి శ్రీలంకలోని తమిళులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరారు. ప్రధాని మోడీతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. మోడీ ప్రధాని అయ్యాక ఆయనతో జయలలి త భేటీ కావడం ఇదే ప్రథమం.
ప్రధాని కార్యాలయంలో ఇరువురు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన 65 పేజీల వినతిపత్రాన్ని ఆమె ప్రధానికి అందించారు. రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయింపు, చెన్నై మెట్రో రైలు విస్తరణ, కావేరీ జల నిర్వహణ బోర్డు ఏర్పాటు.. మొదలైన డిమాండ్లు అందులో ఉన్నాయి. పాక్ జలసంధిలో ఉన్న చిన్న ద్వీపం ‘కచ్చతీవు’ అంశాన్ని కూడా జయలలిత ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. 1974లో దాన్ని శ్రీలంకకు అప్పగించారని, ఆ ద్వీపాన్ని మళ్లీ భారత్ తన ఆధీనంలోకి తీసుకుని, తమిళనాడులోని మత్స్యకారులకు అక్కడ చేపల వేటకు హక్కును కల్పించాలని ఆమె మోడీని కోరారు.
అనంతరం మీడి యా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఎన్‌డీఏలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు.. ఆ ప్రతిపాదనేదీ రాలేదన్నారు. ఎన్‌డీఏకు బయటనుంచి మద్దతిచ్చే ఆలోచనుందా? అన్న ప్రశ్నకు.. ఎన్‌డీఏకు ఆ అవసరం లేదని, బీజేపీకే సొంతంగా మెజారిటీ ఉందన్నారు. రాజ్యసభలో ఎన్‌డీఏకు మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు.. ‘ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం’ అన్నారు. బీజేపీకి లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ.. 243 సభ్యుల రాజ్యసభలో మాత్రం బీజేపీ సభ్యులు కేవలం 42 మందే ఉన్నారు.