23న తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జే జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఈ విషయాన్ని వెల్లడించారు.
22న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నారు. ఇదే రోజు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం పదవికి రాజీనామా చేసి జయకు మార్గం సుగమం చేయనున్నారు. మద్రాసు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆమె ప్రమాణం చేసే అవకాశముంది. చెన్నైలోని ఆర్కే నగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ ఇటీవల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయ ఈ స్థానం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.
ఏడు నెలల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జయలలితను దోషీగా ప్రకటించడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలయ్యారు. ఇటీవల కర్ణాటక హైకోర్టును కింది కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు లైన్ క్లియరైంది.