డీఎంకే చేసిందేమీ లేదు: జయలలిత
తిరునల్వేలి: డీఎంకే హయాంలో ప్రజల సంక్షేమానికి చేసిందేమీ లేదంటూ తమిళనాడు సీఎం జయలలిత విమర్శించారు. తిరునల్వేలి ఎన్నికల ప్రచారంలో గురువారం ఆమె ప్రసంగిస్తూ... డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఓటు వేయడమంటే ప్రజా సంక్షేమానికి వ్యతిరేకించినట్లేనన్నారు. చాలా సమస్యల్ని డీఎంకే ప్రభుత్వం పరిష్కరించలేక పోయిందంటూ తప్పుపట్టారు. శ్రీలంక తమిళుల సమస్య, అంతర్ రాష్ట్ర జలవివాదం, విద్యుదుత్పత్తి సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో తమిళులపై దాడులు జరుగుతుంటే డీఎంకే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుపట్టారు.
కర్నాటకతో కావేరీ జల వివాదంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమైందని, అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాతే న్యాయం జరిగిందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం తమిళనాడుకు చీకట్లోకి నెట్టివేసిందని, తాము రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు తీసుకొచ్చామని చెప్పారు. 2జీ, ఎయిర్‌సెల్- మాక్సిస్ ఒప్పందం, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసుల అవినీతిలో డీఎంకే ప్రమేయం ఉందంటూ జయ విమర్శించారు.