రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా పాలక బీజేపీ గెలుపుపై భరోసా వీడలేదు. బీజేపీ నేతృత్వంలోనే జార్ఖండ్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి రఘబర్‌దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టాల్సిన క్రమంలో ఇప్పుడే స్పష్టమైన ప్రకటన చేయలేమని చెప్పుకొచ్చారు. ఆధిక్యాలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి మధ్య దోబూచులాట నెలకొందని, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్ ఏ క్షణమైనా తారుమారు కావచ్చని ఆయన పేర్కొన్నారు.
తుది ఫలితాలు వెల్లడైన తర్వాత తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న వాళ్లను చేసుకోనివ్వండి..ఒకరు వేడుక చేసుకుంటుంటే ఎవరూ ఆపబోరని వ్యాఖ్యానించారు. సీఎం మాట్లాడిన సమయంలో మొత్తం 81 స్ధానాలకు గాను బీజేపీ 28 స్ధానాల్లో ముందంజలో ఉండగా, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 42 స్ధానాల్లో ముందంజలో ఉండి మేజిక్ ఫిగర్ (41)ను అందుకుంది. విపక్ష కూటమి విజయంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ జార్ఖండ్ సీఎం పగ్గాలు చేపడతారని కూటమి నేతలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment