ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెడతాం
రాంచీలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు సమష్టి విజయమని, అక్కడి ప్రజలు తమను విశ్వసించి పట్టం కట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, జార్ఖండ్ వనరుల పరిరక్షణ గురించి తాము ప్రజలకు చేసిన విజ్ఞప్తిని మన్నించారని, అందుకే ఇండియా కూటమికి ఘన విజయం చేకూర్చారని అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ పరిశీలకుడి హోదాలో శనివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాంచీకి వెళ్లారు.
అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంతో పాటు జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నివాసంలో జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జేఎంఎం నేతృత్వంలో కూటమి గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలిగామని, అందుకే భారీ విజయం సాధ్యమైందన్నారు.
జార్ఖండ్ ప్రజలకు బీజేపీపై భ్రమలు లేవని, అందుకే ఇండియా కూటమి వైపు నిలిచారని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడతామని భట్టి స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భట్టి కీలకపాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, పార్టీ మేనిఫెస్టో తయారీ, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. పలు దఫాలుగా ప్రచారానికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment