
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జేఎన్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) విద్యార్థులు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన నేపథ్యంలో భారీ ధర్నాకు విద్యార్థులు బయలుదేరారు. ఫీజుల పెంపునకు నిరసనగా ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. యూనివర్సిటీలో 144 సెక్షన్‌ను విధించారు. 1400 మంది అదనపు బలగాలను వర్సిటీకి తరలించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే జేఎన్‌యూ వ్యవహారాలను చర్చించేందుకు వర్సిటీ మానవ వనరుల శాఖ ఇదివరకే త్రిసభ్య కమిటీని నియమించింది.