సాక్షి, ముంబై : మెట్రో-3 ప్రాజెక్ట్‌కు చాలా రోజుల తర్వాత మోక్షం లభించింది. కొలాబా నుంచి బాంద్రా మీదుగా సీప్జ్ వరకు నిర్మించతలపెట్టిన భూగర్భ మెట్రో నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటైన జాయింట్ వెంచర్ కంపెనీ (జేవీసీ), కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెండర్లను ఆహ్వానించేందుకు మంగళవారం ఆమోదం తెలిపాయి. దాదాపు 33.5 కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్న భూగర్భ మార్గానికి రూ.23,156 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
అయితే ఈ ఏడాది చివరి వరకు ఈ భూగర్భమార్గం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన జేవీసీ అనివార్య కారణాల వల్ల ఏడాది నుంచి పనిచేయలేదు. దీని సూచనలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పట్టింది. ఇక నుంచి జేవీసీని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ)గా గుర్తించనున్నారు. నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న, ఇక ముందు కొనసాగనున్న మెట్రో ప్రాజెక్టులకు ఎంఎంఆర్‌సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అడిషినల్ కమిషనర్ సంజయ్ సేథీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియకు జేవీసీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో సగం మొత్తాన్ని జపాన్ బ్యాంకు రుణంగా ఇవ్వనుందని వెల్లడించారు. దీంతో బిడ్డర్లను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలిపారు. ఇదిలా వుండగా, జపాన్ ఇంటర్ నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జేఐసీఏ) మొత్తం ప్రాజెక్టులో 57 శాతం రుణంగా ఇస్తుండగా, దీనికి ఏడాది వడ్డీ 1.4 శాతం చెల్లిం చాలి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 32 శాతం వ్యయాన్ని భరిస్తాయి. మిగితా నిధులను ఇతర మార్గాల్లో సేకరిస్తారు.
మెట్రో-3 పనులకు మోక్షం
Published Thu, Aug 14 2014 11:37 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement