సందీప్ శర్మ హత్య వీడియో దృశ్యం
భిండ్/ఆరా: మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఇసుకమాఫియాపై వరుస స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి, వారితో పోలీసుల లాలూచీని బయటపెట్టిన టీవీ జర్నలిస్ట్ సందీప్ శర్మను సోమవారం లారీతో ఢీకొట్టించి చంపించారు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగాగాయపడ్డ శర్మ చికిత్స పొందుతూ మరణించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. శర్మ బైక్‌ను లారీ ఢీకొడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఇసుక మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శర్మ మధ్యప్రదేశ్ మానవహక్కుల కమిషన్, డీజీపీ, భిండ్ జిల్లా ఎస్పీలకు లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. భిండ్‌లోని సబ్ డివిజినల్ పోలీస్ అధికారి(ఎస్డీపీవో) ఇసుక మాఫియాతో కుమ్మక్కైన విషయాన్ని శర్మ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టారు. ప్రమాదస్థలికి సమీపంలోనే పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ అక్కడకు చేరుకోవడానికి పోలీసులు 20 నిమిషాలు తీసుకున్నారనీ, ఇందులో కుట్ర దాగిఉందని సందీప్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. సందీప్ హత్యపై సత్వర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.
బిహార్‌లో మాజీ సర్పంచ్ చేతిలో..
బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతుండగా వెనకనుంచి ఓ ఎస్‌యూవీ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌తో పాటు ఆయన స్నేహితుడు అక్కడికక్కడే చనిపోయారు. తమ కుమారుడ్ని మాజీ సర్పంచ్ అహ్మద్ అలీనే చంపించాడని నవీన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదం అనంతరం ఎస్‌యూవీ వాహనాన్ని స్థానికులు వెంబడించడంతో నిందితులు కారును వదిలేసి పరారయ్యారు. దీంతో ఆగ్రహోద్రులైన ప్రజలు ఆ ఎస్‌యూవీ వాహనానికి నిప్పంటించడంతో పాటు మాజీ సర్పంచ్ అలీ ఇంటిపై దాడికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనం అలీ పేరుపై ఉందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment