ఉత్తర్ ప్రదేశ్ కన్నోజ్ జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండుగులు కాల్చి చంపారు. పోలీసుల కధనం మేరకు సోమవారం సాయంత్రం దీపక్ గుప్తా అనే జర్నలిస్టు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న భార్యను ఇంటికి తీసుకు వచ్చేందుకు బైక్ పై వెళ్లాడు. వీరు ఇంటికి తిరిగి వస్తుండగా.. హసన్ పూర్ వద్ద ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తుతెలియని వ్యకులు వీరిని అడ్డగించారు. వెంటనే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకితో దీపక్ గుప్తాపై పాయింట్ బ్యాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపాడు.
తొలుత షాక్ గురైన దీపక్ భార్య.. వెంటనే తేరుకు.. సహాయం కోసం కేకలు వేసింది. దీంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దీపక్ ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే దీపక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దోపిడీ కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడికి ఎవరైనా శతృవులు ఉన్నారా...? హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. గత ఆరునెలలుగా.. రాష్ట్రంలో జర్నలిస్టులపై వరస దాడులు బెంబేలెత్తిస్తున్నాయి.