అతిథుల్లా వచ్చి వెళ్లాల్సిందేనా? | Justice Dipak Misra sworn in as new Chief Justice of India | Sakshi
Sakshi News home page

అతిథుల్లా వచ్చి వెళ్లాల్సిందేనా?

Published Tue, Aug 29 2017 6:00 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

అతిథుల్లా వచ్చి వెళ్లాల్సిందేనా? - Sakshi

అతిథుల్లా వచ్చి వెళ్లాల్సిందేనా?

దేశ న్యాయవ్యవస్థకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి (పీజేఐ)ది నాయకత్వ పాత్ర.

దేశ న్యాయవ్యవస్థకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి (పీజేఐ)ది నాయకత్వ పాత్ర. హైకోర్టు జడ్జిల నియామక సిఫారసులను పరిశీలించి ఆమోదించడంతో పాటు సుప్రీంకోర్టులో జడ్జిలను సీజేఐ  అధ్వర్యంలోని కొలీజియం ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. అలాంటి సీజేఐలకు నిర్దిష్ట పదవీకాలం అంటూ లేకపోవడంతో... రెండురోజులు ఉండిపోయే ‘అతిథులు’ అవుతున్నారు.

సోమవారం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన దీపక్‌ మిశ్రా ఆ పదవిలో ఉండేది 401 రోజులే. ఆయనకు ముందు సీజేఐలు పనిచేసిన ఆరుగురిలో అత్యధిక కాలం పనిచేసింది జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు. ఆయన సీజేఐగా 430 రోజులు పదవిలో ఉన్నారు. ఈ ఆరుగురిలో సంవత్సర కాలానికి మించి పదవిలో ఉంది ఇద్దరే.

గడిచిన ఐదేళ్లలో సీజేఐలు – పదవీకాలం
అల్తమాస్‌ కబీర్‌                 – 292 రోజులు
పి.సదాశివం                     – 281
ఆర్‌.ఎం.లోధా                   –153
హెచ్‌.ఎల్‌.దత్తు                 – 430
టి.ఎస్‌.ఠాకూర్‌                  – 397
జే.ఎస్‌.ఖేహర్‌                   –236

మరికొన్ని ఆసక్తికర అంశాలు
♦  1950లో భారత్‌ గణతంత్య్ర రాజ్యమైంది. అప్పటి నుంచి 14 మంది ప్రధానులు, 14 మంది రాష్ట్రపతులు, 16 మంది లోక్‌సభ స్పీకర్లుగా పనిచేశారు.
అదే 1950 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది సీజేఐలు చేశారో తెలుసా? ఏకంగా 45 మంది.
అత్యధిక కాలం సీజేఐగా చేసింది జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌. ఏడేళ్ల ఐదునెలలు ఆయన పదవిలో ఉన్నారు.
♦  అత్యంత తక్కువ సమయం... కేవలం 17 రోజులు సీజేఐగా జస్టిస్‌ కమల్‌ నారాయణ్‌ సింగ్‌ పనిచేశారు.
1997 మార్చి నుంచి నేటిదాకా తీసుకుంటే... 20 సంవత్సరాల ఆరు నెలల కాలంలో 20 మంది సీజేఐలు బాధ్యతలు చేపట్టారు. వీరిలో రెండేళ్లకు పైగా పదవిలో ఉంది నలుగురు మాత్రమే.

సమస్య ఏంటి...
భారత రాజ్యాంగంలో జడ్జిల నియామక ప్రక్రియ, తొలగింపు గురించి ఆర్టికల్‌ 124(2) వివరిస్తుంది. అయితే ఇందులో సీజేఐ నియామకం ఎలా జరగాలనేది నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. దాంతో పదవీ విరమణ చేస్తున్న సీజేఐ సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్‌గా ఉన్న జడ్జి పేరును తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి సిఫారసు చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల రిటైర్‌మెంటు వయసు 65 ఏళ్లు. దాంతో రిటైర్‌మెంటుకు ముందు సీజేఐగా పదోన్నతి పొంది నెలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా సీజేఐలు బెంచ్‌లో కూర్చొని కేసులను విచారిస్తారు. దానికితోడు హైకోర్టులు, సుప్రీంకోర్టుల జడ్జిల నియామకాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఫలితంగా న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత, తేవాల్సిన సంస్కరణలు, పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడం... తదితర కీలకాంశాలపై దృష్టి సారించే అవకాశం, సమయం ఉండటం లేదు. పదవిలో ఉన్న కొద్దికాలం పదవీ బాధ్యతలు ఆకళింపు చేసుకోవడానికి, ఇతర విధులకే సరిపోతోంది.

మార్గమేంటి...
సీజేఐకి కనీసం రెండేళ్ల నిర్దిష్ట కాలపరిమితి ఉండాలనే డిమాండ్‌ న్యాయవర్గాల్లో చాలాకాలంగా ఉంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా ఏదైనా ఒక రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా నియమితుడయ్యే వ్యక్తిని ఉద్యోగ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా కనీసం రెండేళ్లు పదవిలో కొనసాగించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. పదవి చేపట్టిన నెలకే రిటైర్‌మెంటు వయసు వచ్చేసినా... దానితో సంబంధం లేకుండా మిగతా 23 నెలలు డీజీపీగా (మొత్తం రెండేళ్లు అవుతుంది) కొనసాగొచ్చు. తరచూ విభాగాధిపతి మారితే... పాలనపై పట్టు తప్పుతుందనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు. అలాగే సీజేఐ విషయంలోనూ కనీసం రెండేళ్ల నిర్దిష్ట పదవీకాలం ఉండాలని నిపుణుల అభిప్రాయం.

2014 జులైలో నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ) ఏర్పాటుపై చర్చకు అవసరమైన నోట్‌ను సమర్పించిన లా కమిషన్‌ చైర్మన్‌ ఏ.పి.షా... భారత ప్రధాన న్యాయమూర్తికి రెండేళ్ల కనీసం నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని సిఫారసు చేశారు.
2016 డిసెంబరులో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని ఖాళీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ... సీజేఐ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కనీసం రెండేళ్లు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన పదవీకాలం ఉండాలని సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసును 65 నుంచి 67 ఏళ్ల పెంచాలని సూచించింది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement