కొత్త రాష్ట్రపతికి జస్టిస్ కర్ణన్ వినతి
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. తన ప్రతినిధి మాధ్యూస్ జె.నెడుంపర ద్వారా ఆయన కోవింద్‌కు అభ్యర్థన పంపారు. రాజ్యాంగంలోని 72 అధికరణ ప్రకారం.. రాష్ట్రపతికి వినతి అందజేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ఆయన త్వరలోనే దానిని పరిశీలిస్తారని ఆశిస్తున్నామన్నారు. దీనిపై రాష‍్ట్రపతి కార్యాలయంతో టచ్‌లో ఉంటామన్నారు.
కోర్టు ధిక్కరణ నేరం కింద మే 9వ తేదీన జడ్జి కర్ణన్‌కు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆరు నెలల జైలు శిక్ష విధించగా జూన్ 20వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక‌్షనల్ హోమ్‌లో ఉన్నారు. భారత న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్న మొట్టమొదటి జడ్జి కర్ణనే కావటం గమనార్హం.