ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: మంచి కాఫీ లాంటి సినిమా ‘ఆనంద్’ గుర్తుందా? పెళ్లికూతురు కట్టుకున్న చీర బాగోలేదని, వెంటనే చీర మార్చుకోమని చెబుతుంది కాబోయే అత్తగారు. లేదు, నాకీ చీరే బాగుంది. ఇది మా అమ్మ చీర అని చెబుతుంది పెళ్లికూతురు. ఆ మాటలకు కాబోయే అత్తగారు ఉరిమి చూసి, నానా మాటలూ అంటుంది. అప్పుడు పెళ్లికూతురే ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. అందరూ ఆమెను నానా మాటలూ అంటారు చీరకోసం పెళ్లి రద్దు చేసుకుంటావా అని. అచ్చం ఇటువంటి ఘటనే కర్ణాటకలోని హసన్‌లో జరిగింది. బీఎన్ రఘుకుమార్, సంగీత అనే అమ్మాయి ఏడాది కాలంగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లికి సిద్ధపడ్డారు.
ఈ మేరకు గురువారం పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. అయితే పెళ్లికూతురికి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పెళ్లి చీర నాసిరకంగా ఉందన్న కారణంతో రఘుకుమార్ తల్లిదండ్రులు పెళ్లిమండపంలో గొడవ చేశారు. ‘అమ్మాయిని చీర మార్చుకు రమ్మనండి, తను కట్టుకుని ఉన్నది బొత్తిగా నాసిరకంగా ఉంది’ అంటూ వధువు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే వాళ్లు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఆ వాదన చివరికి పెళ్లి రద్దు చేసేందుకు దారితీసింది. ఈ క్రమంలో తల్లిదండ్రుల మాట మేరకు రఘుకుమార్ పెళ్లి మండపానికి రాకుండానే అదృశ్యమైపోయాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికొడుకు మీద, అతని అమ్మానాన్నల మీద స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. మంచి కాఫీ లాంటి ఆనంద్ సినిమాలా ఈ కథ కూడా సుఖాంతం అవుతుందేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment