
కన్హయ్య కుమార్ పై హత్యాయత్నం
ముంబై: జెట్ ఎయిర్ వేస్ విమానంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ వెల్లడించారు. తన గొంతు నులిమేందుకు దుండుగుడు ప్రయత్నించాడని అతడు ఆరోపించాడు. ముంబై-పుణే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విమానం దిగిపోవాలని తమపై సిబ్బంది ఒత్తిడి చేశారని కన్హయ్య కుమార్ తెలిపాడు.
తనపై హత్యాయత్నం చేసిన వ్యక్తిపై జెట్ ఎయిర్ వేస్ ఎటువంటి చర్య తీసుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. కన్హయ్యపై దాడికి యత్నించిన సహ ప్రయాణికుడిని మనాస్ జ్యోతి డేకాగా గుర్తించినట్టు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. అయితే ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. భద్రతా కారణాలతో కొంతమంది ప్రయాణికులను ముంబై ఎయిర్ పోర్టులో దించేశామని వెల్లడించింది.