కన్హయ్య వీడియో అసలైందే
నిర్ధారించిన సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదంలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో ర్యాలీ సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కేసులో వీరు రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నిజమైనదేనని, అందులో ఎలాంటి మార్పులూ జరగలేదని సీబీఐ ఫోరెన్సెక్ ల్యాబ్ పరిశీలనలో తేలిందని పోలీసులు చెప్పారు.
నాటి సంఘటనకు సంబంధించి ఒక హిందీ న్యూస్ చానల్ నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కెమెరా, వీడియో ఉన్న సీడీ, ఇతర పరికరాలను ఢిల్లీలోని సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వీటిని పరీక్షించిన ల్యాబ్.. అందులోని దృశ్యాలన్నీ నిజమైనవేనని నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు జూన్ 8న నివేదిక ఇచ్చిది. మే నెలలో 4 వీడియోలను ఢిల్లీ పోలీసులు కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపగా.. అక్కడా నిజమైనవేనని తేల్చారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం మొత్తం ఏడు వీడియోలను హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్ పంపగా.. రెండు వీడియోల్లో మార్పులు చేశారని, మిగతావన్నీ నిజమైనవేనని అక్కడ నిర్ధారించారు.