మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిత్రంలో బీజేపీ నేత రామ్ మాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో కలసి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసానికి వెళ్లి.. ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన పనితీరుకు ఆకర్షితుడినై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా. రాంమాధవ్ ఆధ్వర్యంలో అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరా. మోదీ నాయకత్వంలో బీజేపీలో పనిచేయడమే నా ప్రధాన ఉద్దేశం. అమిత్‌షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో కలసి మోదీ నాయకత్వంలో పనిచేస్తా’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో భవిష్యత్తు లేదనే బీజేపీలో చేరారా? అని ప్రశ్నించగా.. ఆయన బదులిస్తూ ‘‘అదేం కాదు. అలా అయితే ఎన్నికల ముందే చేరేవాడిని. ఎన్నికలకు ముందే తెలుసు కదా..’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదంటారా? అన్న ప్రశ్నకు.. అది తానెలా చెప్పగలనని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో పీసీసీ పదవి దక్కలేదన్న అసంతృప్తే బీజేపీలో చేరేందుకు కారణమైందా? అని ప్రశ్నించగా.. ‘‘అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ బీజేపీలో చేరేందుకు అది కారణం కాదు. మోదీ పనితీరు నచ్చి చేరుతున్నా’’ అని ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు బీజేపీలో చేరే అవకాశముందా? అని అడగ్గా.. ‘‘వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుతో చర్చలు జరుగుతున్నాయి’’ అని కన్నా చెప్పారు.