బెంగళూర్ : రాజీనామా చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని, తొందరపాటుతో నిర్ణయం తీసుకోనని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం రెబెల్ ఎమ్మెల్యేలు తనను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేశానని సాగిన ప్రచారం బాధించిందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పదకొండు మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారు. కాగా, తనకు గతంలో 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించగా, వారిలో 8 మంది ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లో రాజీనామా చేయలేదని, ఇక వారిలో చిత్తశుద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజా రాజీనామాలపై అసెంబ్లీ విధివిధానాలు, నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ఇక సంకీర్ణ సర్కార్ అసంతృప్త ఎమ్మెల్యేలు స్పీకర్‌తో భేటీ నేపథ్యంలో కర్ణాటక విధానసౌధ వద్ద హైడ్రామా నెలకొంది. రాజీనామా చేసిన పదకొండు మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ సురేష్ కుమార్‌ను కలుసుకుని రాజీనామాలపై వివరణ ఇచ్చారు. అంతకుముందు ముంబై హోటల్‌లో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బెంగళూర్ చేరుకున్నారు.
మరోవైపు రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు తనకు మరికొంత సమయం కావాలని కోరుతూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. అసంతృప్త ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా అనేది వారిని కలిసి స్వయంగా చర్చించాల్సి ఉందని కోర్టుకు నివేదించారు.
ఎమ్మెల్యేలకు కాంగ్రెస్, జేడీఎస్ విప్ జారీ
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో శుక్రవారం నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం రాజకీయ వేడి రగిలిస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండటంతో సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment