
‘పాత నోట్లపై గడువు పెంచండి’
బెంగళూరు: పాత పెద్ద నోట్ల చెలామణి గడువును డిసెంబర్ 30 వరకు పెంచాలని కేంద్రాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కోపరేటివ్ బ్యాంకులకు సరిపడా కరెన్సీ నోట్లు సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ లాబ్స్, బ్లడ్ బ్యాంకుల్లో కూడా పాతనోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
పాత రూ.500, రూ. వెయ్యి నోట్ల చెలామణిని నవంబర్ 24 వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టిక్కెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు వాడుకోవడానికి కేంద్రం సడలింపు నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశముంది.