సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి, ఫెరా ఉల్లంఘనల కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట హాజరు అయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియా విదేశీ పెట్టుబడుల క్లియరెన్స్ కేసులో ఈనెల 23న సీబీఐ ఎదుట హాజరుకావాలని కార్తీని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో కార్తీకి సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించగా కార్తీకి వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం దిగువ కోర్టు జారీ చేసిన స్టే ఉత్తర్వులను తోసిపుచ్చింది.
సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని కార్తీని సూటిగా ప్రశ్నించింది. విచారణకు హాజరయ్యేందుకు తనకు భయం లేదని, తన భద్రతపైనే ఆందోళన చెందుతున్నానని కార్తీ చిదంబరం కోర్టుకు నివేదించారు. దీంతో న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కార్తీని సుప్రీం కోర్టు అనుమతించింది.