సాక్షి, న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. ఆయనను అయిదు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఢిల్లీ పటియాలా కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా కార్తీ చిదంబరాన్ని 14 రోజుల కస్టడీకి అనుమతించాలని సీబీఐ అధికారులు కోరినప్పటికీ ...న్యాయస్థానం మాత్రం మార్చి 6వ తేదీ వరకూ కస్టడీకి అనుమతించింది. ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు తన తండ్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సమయంలో అనుమతులు ఇప్పించారనే ఆరోపణలను కార్తీ చిదంబరం ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా కార్తీ చిదంబరంకు భారీగా ముడుపులు ముట్టాయని సీబీఐ ఆరోపిస్తోంది. రిమాండ్ సమయంలో రోజుకు రెండు గంటలు న్యాయవాదిని కలుసుకునేందుకు కోర్టు అనుమతించింది. ప్రిస్క్రిప్షన్‌లోని మెడిసిన్స్ తీసుకోవచ్చని..అయితే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతించబోమని తెలిపింది.
అంతకుమందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. నిందితుడిని సహ నిందితుడు, ఇతర నిందితులు, అనుమానితులతో కలిసి విచారించేందుకు సమయం పడుతుందని..తాము సమీకరించిన ఆధారాలపై అతడిని ప్రశ్నించాల్సి ఉందని అంటూ కార్తీని కనీసం 14 రోజుల పాటు విచారించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. కార్తీ తల్లి, సీనియర్ అడ్వకేట్ నళినీ చిదంబరం కోర్టులో కుమారుడి పక్కనే కూర్చున్నారు.మరోవైపు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కార్తీ పేర్కొంటున్నారు. సీబీఐ తనకు కనీసం సమన్లు ఇవ్వకుండా ఇప్పుడు విచారణకు సహకరించడం లేదని ఆరోపించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని కార్తీ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత సింఘ్వీ అన్నారు. ఈ కేసులో కార్తీకి వ్యతిరేకంగా తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సీబీఐ చెబుతోంది. చిదంబరాన్ని కూడా ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment