
లండన్ వెళ్లిపోయిన చిదంబరం కొడుకు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం బ్రిటన్ వెళ్లారు. అవినీతి, లంచం ఆరోపణల కేసుకు సంబంధించి రెండు రోజులుగా ఆయన ఇంట్లో, బంధువుల ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరమే ఆయన లండన్‌కు వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది. అయితే, ఉన్నపలంగా ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రయాణం కాదని, అంతకుముందే పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం బ్రిటన్ వెళ్లినట్లు కార్తీ చిదంబరంతోపాటు ఆయన తండ్రి చిదంబరం స్పష్టం చేశారు.
‘ట్రావెలింగ్ ప్లాన్స్ ప్రకారమే కార్తి వెళుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతడు తిరిగొస్తాడు. కార్తీపై ట్రావెల్ బ్యాన్ లేదు’ అని చిదంబరం పీటీఐకి తెలిపారు. గత మంగళవారం సీబీఐ అధికారులు కార్తీ నివాసంతోపాటు నగరంలోని ఆయనకు సంబంధించిన నాలుగు ప్రధాన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తన తండ్రి చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాకు సంబంధించిన మీడియా కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకొని అవినీతికి పాల్పడి వారి కంపెనీలకు అనుమతులిప్పించారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.