సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 24తేదీవరకు కార్తీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మూడు-రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత మరో15 రోజుల కస్టడీ కోరిన సీబీఐ ప్రతిపాదనకు కోర్టు నో చెప్పింది. అంతేకాదు కార్తీ ముందస్తు బెయిల్ పీటిషన్‌ను తోసిపుచ్చింది. జైలులో ఇంటి భోజనానికి అవకాశం ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చి చెప్పింది. మార్చి 15కార్తీ బెయిల్ పీటిషన్‌ను విచారించనున్నట్టు తెలిపింది.
అయితే భద్రతాకారణాల రీత్యా తనకు ప్రత్యేక సెల్ కేటాయించాలని కార్తీ అభ్యర్థించారు. 1995 లో బిస్కట్ బారన్ రాజన్ పిళ్ళై మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసిన కార్తీ చిదంబరం తాను అలా కావాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తనకు ఏమైనా జరగవచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యేకగది, బాత్ రూం కావాలని కార్తీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ఇంటిలో వండిన ఆహారం, మందులు, కళ్లజోడు లాంటి కావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దేశ ఆర్థికమంత్రిగా తన తండ్రి చిదంరబం పనిచేసిన సమయంలో ఉగ్రవాద కేసులను నిర్వహించారని ఆయన వాదించారు. అయితే మందులు, కళ్లజోడుకు అంగీకారం తెలిపిన కోర్టు మిగిలినవాటిని తోసి పుచ్చింది. ఆయన భద్రతకు ఢోకాలేదని చెప్పింది. ఈ సమయంలో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా కోర్టులో ఉన్నారు.
కాగా యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా పని చేసిన చిదంబరం అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ నిధుల కోసం కుమారుడు కార్తీకి లాభం చేకూరేలా వ్యవహరించారని సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇంద్రాణీ ముఖర్జీ వాంగ్మూలం నేపథ్యంలో ఫిబ్రవరి 28 న చెన్నై విమానాశ్రయంలో కార్తీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment