
కరుణానిధి @ 93.. భారీ ఏర్పాట్లు
ద్రవిడ రాజకీయాల్లో కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి త్వరలో 93వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఇందుకోసం తమిళనాట భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, పలువురు వామపక్షాల నేతలు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. జూన్ 3వ తేదీ శనివారం నాడు కరుణానిధి పుట్టినరోజు.
ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్, ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్, టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంపీ డి.రాజా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణసామి తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. ఈ పుట్టినరోజుకు మరో విశేషం కూడా ఉంది. కరుణానిధి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టి సరిగ్గా 75 సంవత్సరాలు అవుతోంది. అయితే.. వయోభారం కారణంగా పలురకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కరుణానిధి ఈ వేడుకలలో ఎంతవరకు పాల్గొంటారనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ ఆయన రాలేకపోతే.. స్టాలిన్ ఆధ్వర్యంలోనే వేడుకలు మొత్తం జరిగే అవకాశం ఉంది.