‘ఒక్క నాయకుడు రాలేదు.. తీవ్ర అవమానం’
కశ్మీర్: ఉగ్రవాదుల చేతుల్లో అమరవీరులైన జవాన్లకు, పోలీసులకు సానుభూతిగా మీడియా ముందు ఆర్భాటాలు చేయడానికి మాత్రమే రాజకీయ నాయకులు పనికొస్తారని, వారి అంతిమ క్రియల్లో పాల్గొని సముచిత గౌరవం ఇవ్వడంలో మాత్రం వారి జాడ కూడా కనిపించదని మరోసారి నిరూపితమైంది. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాల్లో పోలీసులు చనిపోతే వారికి కనీసం గౌరవం దక్కలేదు. ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వారి అంతిమ క్రియలకు హాజరుకాలేదు. అంతేకాదు.. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
కానీ, పోలీసుల కాల్పుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాదుల అంతిమక్రియలకు మాత్రం పెద్ద మొత్తంలో వారికి సంబంధించిన వారు హాజరయ్యారు. దీంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గత శుక్రవారం అనంత్‌నాగ్ జిల్లాలో లష్కరే ఉగ్రవాదులు ఆరుగురు పోలీసులను దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఒక్క నాయకుడు కూడా హాజరుకాలేదు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా తమ నాయకులను జమ్ముకశ్మీర్ డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ కుమార్ సింగ్ సమర్థించుకున్నారు. వారంతా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి ముఫ్తీతో కలిసి చర్చిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ కారణంగానే రాలేకపోయారని చెప్పారు.