Jammu kashmir encounter
-
‘ఒక్క నాయకుడు రాలేదు.. తీవ్ర అవమానం’
కశ్మీర్: ఉగ్రవాదుల చేతుల్లో అమరవీరులైన జవాన్లకు, పోలీసులకు సానుభూతిగా మీడియా ముందు ఆర్భాటాలు చేయడానికి మాత్రమే రాజకీయ నాయకులు పనికొస్తారని, వారి అంతిమ క్రియల్లో పాల్గొని సముచిత గౌరవం ఇవ్వడంలో మాత్రం వారి జాడ కూడా కనిపించదని మరోసారి నిరూపితమైంది. జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాల్లో పోలీసులు చనిపోతే వారికి కనీసం గౌరవం దక్కలేదు. ఒక్కరంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వారి అంతిమ క్రియలకు హాజరుకాలేదు. అంతేకాదు.. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. కానీ, పోలీసుల కాల్పుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాదుల అంతిమక్రియలకు మాత్రం పెద్ద మొత్తంలో వారికి సంబంధించిన వారు హాజరయ్యారు. దీంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గత శుక్రవారం అనంత్‌నాగ్ జిల్లాలో లష్కరే ఉగ్రవాదులు ఆరుగురు పోలీసులను దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ఒక్క నాయకుడు కూడా హాజరుకాలేదు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా తమ నాయకులను జమ్ముకశ్మీర్ డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ కుమార్ సింగ్ సమర్థించుకున్నారు. వారంతా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి ముఫ్తీతో కలిసి చర్చిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ కారణంగానే రాలేకపోయారని చెప్పారు. -
నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు
శ్రీనగర్: శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా ఏమాత్రం బెదరకుండా పోరాడాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్తున్నా లెక్కచేయకుండా తుపాకీ ఎక్కుపెట్టి యుద్ధం చేశాడు. పెద్ద ఎత్తున ఆయుధాలతో దేశంలోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ పోరాటంలో తీవ్రంగా గాయపడి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. వీరమరణం చెందిన భారత సైనికుడు 36 ఏళ్ల హవీల్దర్ హంగ్పాన్ దాదా సాహసానికి మారు పేరుగా నిలిచాడు. జమ్ము కశ్మీర్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హవీల్దర్.. నలుగురు ఉగ్రవాదులను చంపాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బొడురియా హవీల్దర్ సొంత గ్రామం. దాదా అని పిలుచుకునే హవీల్దర్ 1997లో అసోం రెజిమెంట్‌లో చేరాడు. 35 రాష్ట్రీయ రైఫిల్స్‌లో జవాన్‌గా సేవలందించాడు. 13 వేల అడుగుల ఎత్తున ఉన్న శంసబరి రేంజ్లో పనిచేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో హవీల్దర్ తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హవీల్దర్ ధైర్యసాహసాలు ప్రదర్శించి, శత్రువులతో భీకరయుద్ధం చేసి నలుగురిని హతమార్చాడని ప్రశంసించారు. దేశంకోసం ప్రాణత్యాగం చేశాడని చెప్పారు. హవీల్దర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతనికి భార్య లొవాంగ్, కుమార్తె రోకిన్, కొడుకు సెన్వాంగ్ ఉన్నారు. -
ఎన్కౌంటర్లో జవాను మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా అటవీ ప్రాంతంలో మిలిటెంట్లకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల ఘటనలో ఓం వీర్ సింగ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మిలిటెంట్లు దాగి ఉన్నట్లు సమాచారంతో భద్రతా దళాలు నిన్నటి నుంచి హంద్వారా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిలిటెంట్లు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగటంతో ప్రతిగా జవాన్లు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతోంది.