ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఓ మెడికల్ విద్యార్థినికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆమెకు అకారణంగా చుక్కలు చూపించారు. ఆమె లగేజీలో బాంబు ఉందని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు.
ఢాకా నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఆమెకు ఢాకా, కోల్కతా విమానాశ్రయాల్లో లగేజ్ చెకింగ్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఢిల్లీలో మాత్రం బాంబు ఉందంటూ అదుపులోకి తీసుకోవటంతో ఆమె షాక్కు గురైంది. ఆమెతో ఉన్న ముగ్గురు మిత్రులు సైతం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ ఫ్రెండ్ను వదిలేసిన తరువాతే మేమూ వెళ్తామంటూ విమానాశ్రయంలో భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తరువాత అధికారులు ఆమెను వదిలేశారు.
అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలుపకపోవటంతో ఆమె తండ్రి ఎయిర్ పోర్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజనాథ్ సింగ్ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో వారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ను మిస్సయ్యారు.