రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ!
నగరంలోని జనసేనకు చెందిన దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు ఆదివారం బయల్దేరి కశ్మీర్‌కు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. వారంతా కశ్మీర్ అందాలను తిలకించేందుకు బయల్దేరిన పర్యాటకులని అనుకుంటే పొరపాటే. కశ్మీర్‌లో భారత సైనికుల మీదకు రాళ్లు రువ్వే అల్లరిమూకలకు రాళ్లతోనే బుద్ధి చెప్పాలనుకుంటున్న కార్యకర్తలు. వారికి గత కొంతకాలంగా రాళ్లు రువ్వడంలో జనసేన శిక్షణ ఇస్తోంది.
గంగా నది కాలువ పక్కన రెండు గడ్డి బొమ్మలను ఏర్పాటు చేసి, వాటికి తగిలేలా రాళ్లు రువ్వడంలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు జనసేన వ్యవస్థాపకుడు అరుణ్ పూరి చైతనాయ్ తెలిపారు. శిక్షణకు సంబంధించిన వీడియో కూడా మీడియాలో కనిపిస్తోంది. అందులో ‘పాకిస్తాన్ చావాలి’ అనే నినాదాలతో జనసేన కార్యకర్తలు గడ్డిబొమ్మలపైకి రాళ్లు రువ్వుతూ కనిపించారు. అయితే ఆ వీడియోను చూస్తే అందులో ఆవేశంతో, అక్రోశంతో రాళ్లు రువ్వుతున్న సుశిక్షితుల్లా ఎవరూ లేరు. కేవలం నిరసనగా రాళ్లు బొమ్మలకు తగిలేలా విసురుతున్నట్లు కనిపిస్తోంది.
కశ్మీర్‌లో రాళ్లురువ్వే అల్లరి మూకలను ఎదుర్కొనేందుకు తమ కార్యకర్తలు వెయ్యిమంది సిద్ధమయ్యారని, అందుకు అనుమతించాలని అటు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోపాటు స్థానిక అధికారులను కూడా కోరామని, ఆదివారం సాయంత్రానికి కూడా వారినుంచి అనుమతి రాకపోవడంతో స్థానిక పోలీసులు తమను అడ్డుకున్నారని అరుణ్ పూరి తెలిపారు. తమకు అనుమతి రాకపోయినా సరే, వ్యక్తిగత స్థాయిలోనైనా సరే కశ్మీర్ వెళ్తామని, తమవెంట ట్రక్కుల్లో రాళ్లు కూడా వస్తాయని ఆయన చెప్పారు.