కేజ్రీవాల్‌కు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి ఆయనకు మినహాయింపు లభించింది. ఆయన తరుపున న్యాయవాది హాజరయ్యేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 2013లో ఓ పత్రికా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సిబల్ కుమారుడు అమిత్ సిబల్ నేర పూరిత పరువు నష్టం దావా కేసు వేశారు.
దీనికి సంబంధించి ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉందని కింది స్థాయి కోర్టు ఆదేశించగా తాను ముఖ్యమంత్రిగా పలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని, తన తరుపున వేరేవారి హాజరుకు అనుమతిస్తూ తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను ఆమోదించింది. అయితే, కేజ్రీవాల్ హాజరుకాకుంటే కేసు ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే మాత్రం హాజరుకావాలంటూ ఆదేశించే హక్కు మాత్రం కింది కోర్టుకు ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.