న్యూఢిల్లీః దేశ రాజధాని నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నడుం బిగించింది. జూలై నెలాఖరుకల్లా యాచకులకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి, వారికి పునరావాసాన్ని కల్పించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కొత్త ప్రణాళికను రచించి, ప్రారంభించేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో 75,000 మంది వరకూ బిచ్చగాళ్ళు ఉన్నట్లు గుర్తించిన ఆ శాఖ... వారిని అక్కడినుంచి తరలించి రాజధాని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే పనిలో పడింది.
ఢిల్లీ అభివృద్ధికి ఆమ్ ఆద్మీపార్టీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మరో అడుగు ముందుకేసింది. రాజధాని నగరంలో యాచకులు లేకుండా చేసి, ఢిల్లీ గౌరవాన్నికీర్తి పాతకన నిలిపే ప్రయత్నం చేస్తోంది. ఆప్ చేపట్టిన ప్రస్తుత ప్రాజెక్ట్ లో భాగంగా జూలై నెలఖారుకల్లా రాజధాని నగరంలో ఉన్న సుమారు 75000 మంది యాచకులను అక్కడినుంచీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బిచ్చగాళ్ళలో 40 శాతం మంది మహిళలు కూడ ఉన్నట్లు గుర్తించిన శాఖ.. వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రణాళికలు పూర్తి చేశామని, ఈ నెల్లోనే వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళనందరినీ తరలిస్తామని ఆశాఖ అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ గౌరవాన్ని మరింత పెంచేందుకు ఆప్ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెప్తున్నారు. టూరిజం అభివృద్ధి చెందుతున్ననేపథ్యంలో నగరానికి వస్తున్న అనేకమంది విదేశీయులకు బిచ్చగాళ్ళ బెడద పెరుగుతున్నతరుణంలో ఈ ప్రత్యేక డ్రైవ్ పై దృష్టి సారించినట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు.
కార్యక్రమంలోని మొదటి ఫేజ్ లో భాగంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెన్నాట్ ప్లేస్ నుంచి ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ ప్రారంభిస్తారు. ఏడు బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ పోలీసులు నగరంలోని యాచకులను వారికి కేటాయించి షెల్టర్లకు తరలించే కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా నగరంలోని బిచ్చగాళ్ళను తొలగించే ముందు వారిని మొబైల్ కోర్టుల్లో విచారించనున్నట్లు తెలిపారు. ఢిల్లీని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న నేపథ్యంలో 2009 కామన్ వెల్గ్ గేమ్స్ కు ముందు కూడ యాచకులను విచారించేందుకు ప్రభుత్వం రెండు మొబైల్ కోర్ట్ లను ప్రవేశ పెట్టింది. కాగా ప్రస్తుత డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే సుమారు 25 మొబైల్ వ్యాన్లు ఢిల్లీలోని బిచ్చగాళ్ళను గుర్తించే పనిలో పడ్డాయని, ఈ వ్యాన్లలో తెచ్చిన బిచ్చగాళ్ళందరినీ కింగ్స్ వే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. అనంతరం అక్కడినుంచీ వారికి కేటాయించిన హోమ్ లకు తరలిస్తారు. ప్రస్తుతం 3000 మంది పట్టే 11 బెగ్గర్ హోం లు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కాగా ఢిల్లీలోని 75000 మంది యాచకుల్లో 30 శాతం మంది 18 ఏళ్ళ లోపు వారు, 40 శాతం మహిళలు ఉన్నట్లు సాంఘిక సంక్షమ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది.
ఢిల్లీని 'బెగ్గర్ ఫ్రీ' నగరంగా చేస్తాం..
Published Mon, Jul 4 2016 11:24 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement