
పడి లేచిన కెరటం
పేరు : అరవింద్ కేజ్రీవాల్
జననం: 1968, ఆగస్టు 16
తల్లిదండ్రులు: గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతాదేవీ
స్వస్థలం: హర్యానాలోని ిసివానీ
కుటుంబం: భార్య సునీతా (ఈమె కూడా ఐఆర్‌ఎస్ అధికారి), ఇద్దరు పిల్లలు (కూతురు హర్షిత, కుమారుడు పుల్కిత్)
విద్యాభ్యాసం: ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి
తొలి ఉద్యోగం: 1989నుంచి మూడేళ్లు టాటా స్టీల్స్‌లో ఉద్యోగం.
సివిల్స్ వైపు: అఖిల భారత సర్వీసులకు పోటీ పడేందుకు 1992లో ఉద్యోగానికి రాజీనామా. పరీక్షల తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపిక.
సామాజిక కార్యక్రమాలు: ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యకర్తగా గుర్తింపు. ఆర్‌టీఐ చట్టం కోసం అలుపెరగని పోరు.
పురస్కారాలు: ఆర్‌టీఐ చట్టం కోసం చేసిన కృషికిగాను 2006లో రామన్‌మెగాసెసే అవార్డు
పూర్తిస్థాయి కార్యకర్తగా: పూర్తి స్థాయిలో సామాజిక సేవ కోసం 2006 ఫిబ్రవరిలో ఐటి విభాగంలో జేసీ ఉద్యోగానికి రాజీనామా. ‘పబ్లిక్
కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ పేరుతో ఎన్జీవో ఏర్పాటు.
ఆహారపు అలవాట్లు: శాకాహారం మాత్రమే.
‘ధర్నేబాజ్’ అని విమర్శించారు.. ‘అరాచకవాది’ అని ముద్రలేశారు.. పబ్లిక్‌స్టంట్లు అంటూ ఎద్దేవా చేశారు..! వీటన్నింటినీ చీపురుకట్టతో తుడిచి పారేసి ఆ సామాన్యుడు అసామాన్యమైన విజయాన్ని లిఖించాడు!! అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ విజయయాత్రకు బ్రేకులు వేశాడు. ప్రజల మనసును గెల్చుకొని మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించబోతున్నాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమం పునాదులపై ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్.. ఆది నుంచీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అంతే స్థాయిలో వివాదాలూ ఆయన్ను చుట్టుముట్టాయి. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆప్.. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టి సంచలనం సృష్టించింది. 28 స్థానాలు నెగ్గి మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయినా.. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ గద్దెనెక్కారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి కుటుంబానికి 667 లీటర్ల వరకూ ఉచితంగా నీరందించారు. అవినీతిపై హెల్ప్‌లైన్, కామన్‌వెల్త్ క్రీడల స్కాంలో మాజీ సీఎం షీలా దీక్షిత్‌పై ఎఫ్‌ఐఆర్, చమురు ధరల పెంపు విషయంలో రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సహా నాటి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీపై కేసు పెట్టడం దాకా.. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనాలే! నేరస్తులపై చర్యలు తీసుకోలేని ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా పార్లమెంట్‌కు సమీపంలోనే ధర్నాకు దిగారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ధర్నాలు చేయడం ఏంటంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఇలా కొద్ది రోజులే పదవి ఉన్నా రోజుకో సంచలనాన్ని నమోదు చేశారు కేజ్రీవాల్! అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుపై వివాదం నేపథ్యంలో 2014, ఫిబ్రవరి 15న సీఎం పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడంపైనా విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. అనంతరం కేజ్రీవాల్.. సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించి పార్టీని మిగతా రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీతో తలపడి ఓడిపోయారు. అటు ఢిల్లీలోనూ ఆప్ ప్రభావం చూపించకపోవడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. బీజేపీ విజయయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికలు రావడంతో ఈసారీ కమలానిదే విజయమని అంతా భావించారు. అయితే కేజ్రీవాల్ ఎక్కడా స్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రతిపక్షాల విమర్శలను లెక్కజేయకుండా ముందుకు ఉరికారు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. తాను సీఎం పదవి నుంచి తప్పుకోవడం తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ ఆయన చేసిన అభ్యర్థన ప్రజల హృదయాలను తాకింది. అందుకే సరిగ్గా సంవత్సరం కిందట ఏ పీఠాన్ని అయితే వదులుకున్నారో.. అదే పీఠాన్ని ఏడాది తిరిగే లోపే జనం ఆయనకు బహుమానంగా అందజేశారు!
కేజ్రీవాల్ స్వగ్రామంలో సంబరాలు
భివానీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయం సాధించడంతో హరియాణాలోని భివానీ ప్రాంతంలో గల కేజ్రీవాల్ స్వగ్రామం సివానీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. బాణసంచా పేల్చడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. అక్కడే ఉండే కేజ్రీవాల్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆప్ విజయం మా అందరికి ఆనందాన్ని కలిగించింది. మా కుటుంబ సభ్యులందరం వేడుకలు జరుపుకున్నాం. ఇది ప్రజా విజయం’ అని కేజ్రీవాల్ సోదరుడు సుమన్ వ్యాఖ్యానించారు.