కేజ్రీవాల్ అను నేను.. | Kejriwal takes oath as Delhi chief minister | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ అను నేను..

Published Sun, Dec 29 2013 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

కేజ్రీవాల్ అను నేను..

కేజ్రీవాల్ అను నేను..

రెండున్నరేళ్ల కిందట.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం.. అవినీతికి వ్యతిరేకంగా ‘సామాన్యుడు’ గర్జించాడు.. జనలోక్‌పాల్ కోసం నినదించాడు..!

సాక్షి, న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల కిందట.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం.. అవినీతికి వ్యతిరేకంగా ‘సామాన్యుడు’ గర్జించాడు.. జనలోక్‌పాల్ కోసం నినదించాడు..! ఇప్పుడూ అదే రామ్‌లీలా మైదానం.. లక్షల గొంతుల జయజయధ్వానాలతో మార్మోగింది.. నాడు అవినీతిపై గర్జించిన ఆ ‘సామాన్యుడి’ రాక కోసం ఎదురుచూసింది.. అందరిలాగే ఆ ‘ఆమ్ ఆద్మీ’ మెట్రో రైల్లో వచ్చాడు.. వస్తూ వస్తూ రెండున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకొని వచ్చాడు.. వారి ఆశలను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాడు!! ఆ అ‘సామాన్యుడే’ కేజ్రీవాల్!!! శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, రాఖీబిర్లా, గిరీష్‌సోనీ, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, సత్యేంద్రజైన్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో రామ్‌లీలా మైదానం కిక్కిరిసిపోయింది. జైహింద్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తయిన చీపురు కట్టలను చేతపట్టుకొని కార్యకర్తలంతా ఉత్సాహంగా కనిపించారు.

 నేను మీ వాడిని.. ఇది మీ ప్రభుత్వం: సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి 20 నిమిషాలప్రసంగించారు. ఇది మీ ప్రభుత్వం అని, మీలో ఒకడిగా పనిచేస్తానని చెప్పారు. భారత్ నుంచి అవినీతిని తరిమేద్దామని, మరో పదేళ్లలో దేశం సగర్వంగా తలెత్తుకొనే స్వర్ణయుగపు రోజులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలు, రాజయకీయ నేతలు, అధికార యంత్రాంగం కలిసిక ట్టుగా  పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్న సత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. పాలనలో తమ ప్రభుత్వం కొత్తదనాన్ని చూపిస్తుందని, అధికారగర్వాన్ని ప్రదర్శించకుండా సామాన్యుడి కోసం పనిచేస్తుందని చెప్పడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.

‘‘ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది అరవింద్ కేజ్రీవాల్, ఇతర మంత్రులు కాదు. ఈ ప్రమాణ స్వీకారం చేసింది ఢిల్లీ ప్రజలు. ఈ పోరాటమంతా కేజ్రీవాల్‌ను సీఎం చేయడానికి కాదు.. మార్పు కోసం.. ప్రజల చేతికే అధికారం ఇవ్వడం కోసం.. నిజంగా మేం అధికారంలోకి రావడం ఆ దేవుడి మహిమే..’’ అని అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తన చేతిలో మంత్రదండమేదీ లేదంటూనే ఢిల్లీవాసులంతా సహకరిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘మాకు ఎలాంటి గర్వం లేదు. భవిష్యత్తులోనూ రాదు. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు. జీవితంలో లంచం ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. లంచం అడిగేవారిని పట్టించడంలో సహకరించాలని, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాలన్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని, ఫోన్ నంబరును రెండు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు.

 అహంకారం వద్దు.. నిరాడంబరత ముద్దు: అహంకారం అలవరచుకోరాదని, హంగూ ఆర్భాటాలు లేకుండా నిజాయతీగా పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచించారు. సామాన్యునికి సేవచేయడం కోసం తామున్నామన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. నిజాయితీతో పోటీ చేసి ఎన్నికల్లో ఎవరైనా గెలవవచ్చన్న సందేశాన్ని ఢిల్లీ ప్రజలు దేశవ్యాప్తంగా చాటారని అభినందించారు. రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ తన గురువు అన్నా హజారేను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలు బురద అని వాటికి దూరంగా ఉండాలని అన్నా అనే వారని, కానీ ఆ మాలిన్యాన్ని తొలగించాలంటే బురదలోకి దిగాల్సిందే అని తాను ఆయనకు నచ్చచెప్పేవాడినని కేజ్రీవాల్ చెప్పారు. వారం రోజుల తర్వాత బల నిరూపణలో ప్రభుత్వం ఉంటుందో పోతుందో అన్న భయం తమకు లేదని, అది చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్నారు.

ప్రభుత్వం నడపడంలో అధికారస్వామ్యం అడ్డుపడుతుందని అందరూ అంటున్నారని, అయితే గడిచిన రెండు మూడ్రోజుల్లో తనను కలిసిన ఢిల్లీ ప్రభుత్వ అధికారులలో చాలామంది మంచివారున్నారని పొగిడారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీ శాసనసభా పక్ష నేత హర్షవర్దన్‌పైనా ప్రశంసలు కురిపించారు. ఆయన నిజాయితీపరుడంటూ కొనియాడారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు. ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో కేజ్రీవాల్(45) రెండో వ్యక్తి. 1952లో చౌదరి బ్రహ్మ ప్రకాశ్ 34 ఏళ్ల వయసుకే ఢిల్లీ సీఎంగా పనిచేశారు.

 నిస్వార్థంగా సేవ చేయి: కేజ్రీవాల్‌కు హజారే సూచన

 రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తన ఒకప్పటి శిష్యుడు కేజ్రీవాల్‌కు సామాజిక కార్యకర్త అన్నా హజారే అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఫలితాలపై ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని రాలెగావ్‌సిద్ధిలో చెప్పారు. అనారోగ్యం వల్ల కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి  హాజరుకాలేకపోయానన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు.

  కీలక శాఖలు సీఎం వద్దే..
 
  సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ సచివాలయానికి వెళ్లి బాధ్యత లు స్వీకరించారు. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను వెల్లడించారు.  విద్యుత్తు, హోం, ఆర్థిక, విజిలెన్స్, సర్వీసెస్, ప్లానింగ్ వంటి కీలక శాఖలను కే జ్రీవాల్ తన వద్దే ఉంచుకున్నారు. ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే ?

 మనీష్ సిసోడియా: రెవెన్యూ, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, పీడ బ్ల్యూడీ, పట్టణాభివృద్ధి,
 స్థానిక సంస్థలు, భూమి-భవనాలు
 సోమ్‌నాథ్ భారతీ: పాలనా సంస్కరణలు, పర్యాటక, న్యాయ, కళలు, సాంస్కృతిక శాఖ
 సౌరభ్ భరద్వాజ్: రవాణా, ఆహారం-పౌర సరఫరాలు, పర్యావరణం, ఎన్నికలు, సాధారణ పరిపాలన
 గిరీష్ సోనీ: ఉపాధి, కార్మిక, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు, నైపుణ్య అభివృద్ధి
 సత్యేంద్ర జైన్: ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికలు
 రాఖీ బిర్లా: సామాజిక అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, మహిళా భద్రత, భాషలు
 
 ‘సౌభ్రాతృత్వ’ గీతాలాపన

 ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్, ఈ సందర్భంగా ‘సౌభ్రాతృత్వ’ గీతాన్ని ఆలపించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటే ‘ఇన్సాన్ కా ఇన్సాన్ సే హో భాయ్‌చారా... యెహీ పైగామ్ హమారా’ (మనిషితో మనిషికి ఉండాలి సోదరభావం... ఇదే మా ఆహ్వానం...) అంటూ పాడారు. 1959లో విడుదలైన ‘పైగామ్’ చిత్రం కోసం కవి ప్రదీప్ రాసిన ఈ పాటను మన్నాడే ఆలపించారు. ఈ పాట మనం ఎలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకుంటున్నామో చెబుతుందని కేజ్రీవాల్ అన్నారు.

  దేవుడి మహిమ: కేజ్రీవాల్

 కొన్నేళ్ల కిందటి వరకు తాను నాస్తికుడినని చెప్పుకున్న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం తర్వాత చేసిన ప్రసంగంలో భగవన్నామాన్ని జపించారు. దేశంలోని నాలుగు ప్రధాన మతాల దేవుళ్లను పేరుపేరునా కొనియా డారు.  ఇటీవలే పుట్టిన ఆప్ ఎన్నికల్లో సాధించిన విజయం దేవుడి మహిమ అని, తమను అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.‘ఇది చారిత్రక దినం. అవినీతిని ఓడించి, ప్రజాపాలనను నెలకొల్పే విప్లవం రెండేళ్ల వరకూ ఊహకే అందనిది. ఇది మా ఘనత కాదు, కచ్చితంగా దేవుడి మహిమే. పరమపితకు, ఈశ్వరుడికి, అల్లాకు, వాహే గురువుకు కృతజ్ఞతలు’ అని అన్నారు.
 
 కేజ్రీవాల్‌కు ప్రధాని శుభాకాంక్షలు

 న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్ శనివారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

 హామీలు అమలు చేస్తే మద్దతు కొనసాగుతుంది

 ఢిల్లీవాసులు విద్యుత్, మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికలప్పుడు ఆప్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వారికి మా మద్దతు కొనసాగుతుంది.
 - షకీల్ అహ్మద్ (కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి)

 ప్రభుత్వం స్థిరంగా ఉండాలి

 సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాంగ్రెస్, ఆప్ స్థిర ప్రభుత్వాన్ని అందించాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చి ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నా.          - రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement