
ఢిల్లీ గల్లీలో రేపు కేజ్రీవాల్ ఫైట్
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గురువారం వ్యాపారులు, శ్రామికులు, రైతులతో ఆజాద్ పూర్ మండిలో ఉదయం 11గంటలకు బహిరంగ సమావేశం అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రజానీకమంతా రేపు ఆ సమావేశానికి హాజరవుతారని కేజ్రీవాల్ ట్విట్టర్ లో తెలిపాడు.
అంతకుముందు రోజు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా సూచించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఒక తీర్మానం ఇప్పటికే చేశారు కూడా. మరోపక్క, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు జట్టు ఏర్పాటుచేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో శివసేన పార్టీ కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో తాను నేరుగా పాల్గొనని, మద్దతు మాత్రం ఇస్తానని కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు.