కేరళ ఏజీడీపీ సుదేశ్ కుమార్ (పాత ఫొటో)
తిరువనంతపురం : తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తోన్న పోలీసుపై కేరళ అదనపు డీజీపీ సుదేశ్ కుమార్ కూతురు ఈ నెల 14న దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం సుదేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలిలా... గురువారం ఉదయం సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెళ్లారు. వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ గవాస్కర్ కాస్త ఆలస్యంగా రావడంతో ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేయడంతో.. గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతన్ని దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు.
ఈ విషయమై డ్రైవర్ గవాస్కర్ భార్య కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుదేశ్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గవాస్కర్ వైద్యం కోసం కేరళ డీజీపీ 50 వేల రూపాయలు అందించారు. సుదేశ్ కుమార్ కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
కాగా గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం వాస్తవమేనన్న డీజీపీ.. కింది స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment