టీచర్ల సొంతడబ్బుతో మిడ్ డే మీల్స్...
తిరువనంతపురం: కేరళ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆహారంపై శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్ననిధులు సరిపోకపోవడంతో టీచర్లు వారి సొంత డబ్బు ఖర్చు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు రోజుకు ఒక్కో విద్యార్థి భోజనానికి ఐదు రూపాయలు చొప్పున వెచ్చిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల ఎనిమిది రూపాయలకు పెంచింది. అయితే పౌష్టికాహారం అందించేందుకు ఎనిమిది రూపాయలు సైతం చాలకపోవడంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే మిగిలిన డబ్బును వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కనీస పౌష్టికాహారం అందించాలంటే రోజుకు ఒక్కొక్కరికి 12నుంచి 15 రూపాయలదాకా ఖర్చవుతుంది. అయితే కేరళ ప్రభుత్వం 8 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ఇదికాకుండా వంటచెరకు, వంటగ్యాస్ కు అధికంగా ఖర్చవుతుంది. ఇదంతా తాము స్వయంగా చెల్లిస్తున్నామని అక్కడి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ముఖ్యంగా స్కూల్లో ఇచ్చే పాలు, గుడ్డు వంటి ప్రొటీన్ ఫుడ్ ఆశించే బీద కుటుంబాల్లోని పిల్లలు పాఠశాలకు వస్తుంటారని, లేదంటే వారు డ్రాపవుట్స్ గా మారతారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీంతో చాలాశాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులే సొంత డబ్బును వెచ్చించడం, లేదా పూర్వ విద్యార్థులనుంచి విరాళాలు సేకరించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్ని పెద్ద బడుల్లో పేరెంట్, టీచర్స్ అసోసియేషన్ల సహకారంతో ముందుకు తీసుకెడుతుండగా.. చిన్న స్కూళ్ళలో మాత్రం టీచర్లే సొంతడబ్బుతో నిధులు సమకూర్చుకొని పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం పది రూపాయలైనా వెచ్చించకపోతే విజయవంతంగా పథకం కొనసాగించడం కష్టం అని వారు చెప్తున్నారు. స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు 4 నుంచి 5 రూపాయల ఖరీదు ఉంటుంటే కొద్దిపాటి నిధులతో పథకం నిర్వహణ కష్టసాధ్యంగా మారుతోందంటున్నారు. ప్రతినెలా తన సొంత డబ్బునుంచి రూ. 3,500 ల వరకు స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఖర్చుచేస్తున్నట్లు ఓ అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రిన్సిపాల్ చెప్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూళ్ళలో టీచర్లు కూడ నెలకు మూడునుంచి నాలుగు వేల రూపాయలు తమ సొంత డబ్బు ఖర్చు చేస్తున్నామని, అయితే పిల్లల భోజనానికి ఖర్చుచేసేందుకు తాము బాధపడటం లేదని చెప్తున్నారు.
ట్రావెన్కోర్ రాజవంశీయుల కాలంలో స్థాపించిన శతాబ్దాలనాటి తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అంతా పేద కుటుంబాలవారు, నిరాశ్రయులేనని, వారికి భోజనం అందించడంలో ఎటువంటి రాజీ లేదని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. నిత్యావసరాల ధరలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఒక్కోసారి పాఠశాలను సందర్శించే పూర్వ విద్యార్థుల వినయపూర్వక సహకారాన్ని కూడ తీసుకుంటున్నామని ఆమె చెప్తున్నారు. ప్రతి గురువారం విద్యార్థులకు అందించే పాలకు తనతోపాటు సహ ఉపాధ్యాయులు కూడ డబ్బు వెచ్చిస్తారని, ఆరోజు ఏదైనా సెలవు వస్తే మాత్రం తాము వెచ్చించాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు.