
చక్కటి చీర కట్టు. పెదవులపై చెరగని చిరునవ్వు. ప్రాంగణ ద్వారంలోనే ఎదురై.. రారమ్మని ఆహ్వానించే ఆత్మీయమైన పలకరింపులు! షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ ఇచ్చే నమస్కారాన్ని అందు కున్నాక కొనాలనుకున్న వస్తువు కొనకుండా మానం. ఒకవేళ వద్దనుకున్నా మనతో కొనిపించే వారి వేడికోలు.. ఏ కొంచెం మొహమాటం ఉన్నవారినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కానీ వారి మర్యాదల వెనుక దయనీయమైన వేదన ఒకటుందని కేరళ మహిళలను చూశాక కానీ అర్థం కాదు. ఆ వేదనే కేరళ టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులను
‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది. ఆ ఉద్యమం పేరే మలయాళంలో ఇరుప్పు సమరం.’
పన్నెండు గంటల పాటు ఏకధాటిగా నిలబడి ఉండాలి. అదీ పెదవులపై చిర్నవ్వు చెదరకుండా. 12 గంటల్లో రెండే రెండు సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చు. అది కూడా ఐదు నిమిషాలకు మించకూడదు! లంచ్‌కి 30 నిమిషాలు టైం ఇస్తారు. అంతకన్నా మించితే జీతంలో కోత. అంతే కాదు. పొరపాటున ఎవరూ చూడట్లేదని నేలమీద కూర్చున్నారో కెమెరా కన్నెర్రజేస్తుంది. ఎవరితోనైనా మాట్లాడినా సూపర్‌వైజర్ కంఠం ఖంగుమంటుంది. కాళ్లు పీక్కుపోయి ఒక్క క్షణం గోడకి ఒరిగి ఒంటికాలుపై నుంచున్నా కూడా ఫైనే. ఇక కనీస వేతనం కూడా కాని జీతంలో ఇంటికి తీసుకెళ్లేది కోతలే తప్ప జీతం రాళ్లు కాదు. ఇది ఎక్కడో బానిస దేశంలో కాదు.. మహిళల హక్కుల విషయంలో అగ్రభాగాన ఉన్న కేరళ రాష్ట్రంలో. ఈ పరిస్థితి చివరికి టెక్స్‌టైల్ ఇండస్ట్రీలోనూ, బట్టల షాపుల్లోనూ మహిళా కార్మికులు ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించేలా చేసింది.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం
కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల మహిళా ఉద్యోగుల ‘కూర్చునే హక్కు’ ఉల్లంఘనకు గురి కాగా ఇప్పుడిక 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళా కార్మికులు కూర్చునే హక్కుని సాధించుకున్నారు. ‘రైట్ టు సిట్’ ఉద్యమానికి అనుకూలంగా కేరళ ప్రభుత్వం స్పందించింది. టెక్స్‌టైల్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న కార్మికులకు కూర్చునేందుకు స్టూల్ తదితరాలను ఏర్పాటు చేయాలనీ, ఎనిమిది గంటల పనిదినాన్ని తప్పనిసరిగా పాటించాలని, అంతకు మించి పని చేయించుకోకూడదనీ అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు చట్టంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. అలాగే మధ్యాహ్నం టీ బ్రేక్, లంచ్ బ్రేక్‌లను తప్పనిసరి చేసింది.
ఉద్యమ సార«థి విజి పెన్‌కూట్
అయితే ఇది కేవలం కేరళకు సంబంధించిన విషయం కాదు. అనేక ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లు కూర్చోవడం నేరం. కూర్చుంటే ఫైన్.. లాంటివి సర్వసాధారణంగా అమలైపోతున్నాయి. అయితే అసంఘటిత రంగంలో.. ప్రధానంగా భారీ మాల్స్‌లోనూ, బట్టల దుకాణాల్లోనూ మహిళల పట్ల యాజమాన్యాలు అనుసరిస్తోన్న అమానవీయ చర్యలను మొదటిసారిగా కేరళ మహిళలు ధిక్కరించారు. కేరళకు చెందిన విజి పెన్‌కూట్ ఈ ఉద్యమానికి సారథ్యం వహించారు. ‘ఆ ఇదేం పెద్ద సమస్యా?’ అంటూ పెదవి విరిచేసిన పురుష యూనియన్లకు దీటుగా విజి పెన్‌కూట్ అసంఘటిత రంగ కార్మికులకు ప్రత్యేకంగా 2010లో మహిళా సంఘాన్ని (ఏఎంటీయూ) ఏర్పాటు చేసి ‘కూర్చునే హక్కు’ కోసం ఉద్యమించారు. అలా కేరళ మహిళలు తమ కూర్చునే హక్కు కోసం ఎనిమిదేళ్ల పాటు నిలబడ్డారు.
చీరల షాపులో తొలి తిరుగుబాటు
షాప్ యాజమాన్యాల కాఠిన్యంతో అనేక గంటలపాటు అలాగే నించొని ఉండాల్సి రావడంతో ఈ రంగంలో పనిచేస్తోన్న అనేక మంది మహిళలకు నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, కాళ్లు వాయడం లాంటి అనారోగ్య సమస్యలెదురయ్యాయి. కేవలం రెండేసార్లు టాయ్‌లెట్‌కి వెళ్లే అవకాశం ఉండటంతో మిగిలిన సమయమంతా (యూరినల్స్‌కి వెళ్లాల్సి వస్తుందని) నీళ్లు తాగకుండా ఉండడంతో చివరకు ప్రాణాంతకమైన కిడ్నీ సమస్యలకు దారితీసేది. యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్‌కి కూడా ఇది కారణమయ్యేది. దీంతో మొదట 2014లో కేరళ, త్రిస్సూర్‌లోని కల్యాణ్ చీరల షాప్‌లో మహిళలు తమ ‘కూర్చునే హక్కు’కోసం స్ట్రైక్ చేశారు. కల్యాణ్ చీరల దుకాణంలో స్ట్రైక్‌తో ఉద్యమం ఊపందుకుంది.
దిగివచ్చిన మర్చంట్స్
‘‘మీరు కూర్చోదల్చుకుంటే, లేదా తరచూ టాయ్‌లెట్‌కి వెళ్లాలనుకుంటే, అలాంటి వాళ్లు ఇంట్లో కూర్చోవాలి తప్ప ఉద్యోగాలు చేయకూడదు’’ అని కేరళ మర్చంట్స్ అసోసియేషన్‌తో పాటు వస్త్ర దుకాణాల యాజమాన్యాలు వ్యాఖ్యానించడం ‘కూర్చునే హక్కు’ (ఇరుప్పు సమరం) కోసం పోరాటానికి ఉసిగొల్పిందంటారు ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన విజి. అయితే ఈ ఉద్యమంపై ప్రభుత్వం దృష్టి సారించేందుకు చాలా కాలం పట్టింది. ఈ జూలై 4న కేరళ క్యాబినెట్.. ప్రస్తుతం ఉన్న చట్టంలో ఈ మార్పులు చేయాలని నిర్ణయించడంతో కేరళ మహిళల ‘రైట్ టు సిట్’ ఉద్యమం విజయవంతమైంది. గతంలో ఉన్న కార్మిక చట్టంలో.. ప్రత్యేకించి మహిళల కూర్చునే హక్కు ప్రస్తావన లేదనీ, దీన్ని సవరించడం వల్ల మహిళా కార్మికులందరికీ మేలు జరుగుతుందని కేరళ లేబర్ కమిషనర్ తోజిల్ భావన్ వ్యాఖ్యానించారు. అజిత అనే మాజీ వామపక్ష కార్యకర్త ద్వారా స్ఫూర్తిపొందిన విజి టీనేజ్‌లోనే ఫెమినిస్ట్ ఉద్యమంలో చేరారు. కోళికోడ్‌లోని అసంఘటిత రంగ కార్మికులతో కలిసి పనిచేస్తోన్న విజీ అంటే అక్కడి మహిళలకు అంతులేని గౌరవం. అదే గౌరవాన్ని ఇప్పుడు కేరళ ప్రభుత్వమూ ఆమెపై కనబరిచిందనడానికి సాక్ష్యం.. త్వరలోనే చట్టంలో జరగబోతున్న సవరణే.