టీమ్ మోడీలో కెకె కి కీలక స్థానం?
నరేంద్ర మోడీ రాకతో ప్రధాని అధికార నివాసంలో ఖమణ్, ఖమణీ, ఢోఖ్లా, ఫాఫ్రా వంటి గుజరాతీ రుచులు రావడం ఖాయం. వాటితో పాటే నలుగురు వ్యక్తులు రావడం కూడా అంతే ఖాయం. అయితే ఆ నలుగురిలో ఒక్కరు కూడా గుజరాతీ కారు.
నరేంద్ర మోడీ పన్నెండేళ్ల పరిపాలనలో కొందరు ఐఏఎస్ అధికారులు ఆయనకు అత్యంత ప్రియపాత్రులయ్యారు. ఆయన కనుసైగను ఆదేశంగా భావించి పనిచేసే నలుగురు అధికారులంటే ఆయనకు చాలా ఇష్టం. అందులో నుంచి కనీసం ఇద్దరు ఆయనతో పాటు ఢిల్లికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కునియిల్ కైలాసనాథన్ - ఈయన్ని ఐఏఎస్ సర్కిల్ లో కెకె అంటారు. కేరళలో పుట్టి పెరిగిన ఈ తమిళ అధికారి 1979 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్. ఆయన ఇప్పుడు మోడీని వెన్నంటి ఉండే నీడ లాంటి వాడు. గుజరాత్ లో ఘన విజయం సాధించిన వాటర్ లింకింగ్ స్కీమ్, గుజరాత్ ఓడరేవుల అభివృద్ధి, వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ వంటివి ఈయన చలవే. మోడీ ఘనవిజయాలన్నిటి వెనుకా ఈయన ఉన్నారు. రిటైర్ అయిన తరువాత మోడీ రాజకీయ వ్యూహాల వెనుక కెకె బలమైన హస్తం ఉంది. నిజానికి 2012 ఎన్నికల సమయంలో కెకెను గుజరాత్ బయటకి పంపించేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
జీసీ ముర్ము - ఈయన జార్ఖండ్ కి చెందిన 1985 బ్యాచ్ అధికారి. ఆయన మోడీ కోర్టు వ్యవహారాలను చూస్తూంటారు. మోడీకి ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటున్నారు. ఈయనకి మోడీకి ఎంత లోతైన సంబంధాలున్నాయంటే ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసులో సీబీఐ ముర్మును కూడా ప్రశ్నించింది
ఎకె శర్మ - ఈయన 1988 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ఈయనది ఉత్తరప్రదేశ్ లోని ఆజమ్ గఢ్. ఆయన మోడీని ఒక బ్రాండ్ గా తయారు చేయడంలో కీలకపాత్ర వహించారు. వైబ్రంట్ గుజరాత్ విజయం వెనుకా ఈయనే ఉన్నారు.
విజయ్ నెహ్రా - నెహ్రా 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం గుజరాత్ సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శి. ఆయన ఆనందీ బెన్ పటేల్ కి కూడా అత్యంత సన్నిహితులు. కాబట్టి ఆయన గుజరాత్ లో ఉంటారా లేక ఢిల్లీ వస్తారా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు.