
ఫ్లై ఓవర్ కూలి 21మంది మృతి
ఎన్నికల ప్రచారంతో కోలాహలంగా ఉన్న కోల్‌కతా నగరం గురువారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
88 మందికి గాయాలు
కోల్‌కతాలో దుర్ఘటన
కోల్‌కతా: ఎన్నికల ప్రచారంతో కోలాహలంగా ఉన్న కోల్‌కతా నగరం గురువారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బుర్రాబజార్ ప్రాంతంలో నిర్మాణంలోని ఫ్లైఓవర్ కూలడంతో 21 మంది మరణించారు. 88 మంది గాయపడగా వారికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు ఆందోళ న చెందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిస్థితి హృదయవిదారకంగా మారిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు రక్తం మోడుతున్న చేతులతో సాయం అర్థిస్తూ కన్పించారు. స్థానికులు వారికి మంచినీళ్ల సీసాలు ఇచ్చి తక్షణ సాయం అందించారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే దాదాపు 300 మంది సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసు, ఫైర్ సిబ్బంది వెంటనే సహాయచర్యలు ప్రారంభించారు. సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం రద్దు చేసుకుని ప్రమాద ప్రాంతానికి వచ్చారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహాయచర్యల్ని పర్యవేక్షించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అవసరమైన సిబ్బందిని పంపాలంటూ ఎన్డీఆర్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ ఓపీ సింగ్‌ను ఆదేశించారు. వెంటనే 80 మందితో కూడిన రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చాయి. అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్‌గా పేరొందిన బుర్రాబజార్ ప్రాంతంలో ఇరుగ్గా ఉండే రవీంద్ర సరాని- కె.కె.టాగూర్ రోడ్డుపై 2 కి.మీ. మేర ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ప్రజలు, చిరువ్యాపారులు, ఆటోలు, కార్లు బ్రిడ్జి కింద ఉన్నట్లు కూలకముందు సీసీటీవీ దృశ్యాల్లో రికార్డైంది. కొందరు తప్పించుకునేందుకు యత్నిస్తూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.3 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.లక్ష పరిహారం ఇస్తామని చెప్పింది. పోలీసులు ఐవీఆర్‌సీఎల్ స్థానిక కార్యాలయాన్ని సీజ్ చేసి ఐపీసీ 304, 308, 407 సెక్షన్ల కింద కేసు పెట్టారు. చీఫ్ సెక్రటరీ బసుదేవ్ బెనర్జీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల్లో 15 మందిని గుర్తించారు.
తప్పు మీదంటే మీది: ఫ్లైఓవర్ కూలిందని తెలియగానే తప్పు మీదంటే మీదంటూ పార్టీలు దుమ్మెత్తి పోసుకున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ హయాంలోనే నిర్మాణం ప్రారంభమైందని తృణమూల్ ఆరోపించింది. 2009లో లెఫ్ట్ పాలనలోనే టెండర్‌ను హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ కన్‌స్ట్రక్షన్‌కు అప్పగిస్తూ నిర్ణ యం తీసుకున్నారని సీఎం మమత చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా నిర్మాణ నమూనా వివరాల్ని ఆ కంపెనీ ప్రభుత్వానికి సమర్పించలేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మమత ప్రకటించారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీపీఎం డిమాండ్ చేసింది. ప్రమాదంపై సీబీఐ విచారణ నిర్వహించాలని కేంద్ర మంత్రి నఖ్వీ డిమాండ్ చేశారు.
ప్రధాని తీవ్ర సంతాపం
కోల్‌కతా ఫ్లైఓవర్ ఘటనలో పలువురు మృతిచెందడంపై అమెరికాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ, పునరావాస చర్యల్లో కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతో పాటు, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు ప్రధాని మాట్లాడుతూ సహాయకచర్యలపై ఆదేశాలు ఇస్తున్నారని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ సీఎంతో మాట్లాడిన మోదీ అవసరమైన సాయం అందిస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మా తప్పు కాదు.. దేవుడి చర్య: నిర్మాణ సంస్థ
ఫ్లైఓవర్ నిర్మాణంలో నాణ్యత, సాంకేతిక లోపాలు ఏమీ లేవని, ఇది కేవలం దేవుడి చర్యంటూ నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్ ఉన్నతాధికారి కె.పాండురంగారావు స్పందించారు. 27 ఏళ్లుగా ఎన్నో బ్రిడ్జిలు కట్టామని, ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు.