
కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
సాక్షి, కోల్‌కతా : కొద్దిపాటి జల్లులకే మన నగరాలు జలాశయాల్లా మారుతున్నాయి. కోల్‌కతాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరం జలమయమైంది. రోడ్డుపై మోకాలి లోతుపైగా నీరు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం నెలకొంది. డ్రైన్లు పొంగిపొర్లుతుండటంతో కోల్‌కతాలో బుధవారం జనజీవనం స్థంభించింది. రహదారులపై నిలిచిన నీటి ఉధృతి తగ్గకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, కోల్‌కతాలో ఇప్పటివరకూ 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం అంచనా వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు బెంగాల్, అసోంనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. బెంగాల్‌లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు పది మంది మరణించారని అధికారులు తెలిపారు. అటు అసోంనూ వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. గాలుల ఉధృతికి భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.