
నేడు కోవింద్ ప్రమాణం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ అభ్యర్థి, బిహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం దేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదలయ్యే కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు కోవింద్.. రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్ ముఖర్జీతో కలసి అక్కడికి చేరుకుంటారు.
రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కోవింద్ ప్రమా ణం చేశాక సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తాయి. కార్యక్రమం ముగిశాక కోవింద్ రాష్ట్రపతి భవనానికి చేరుకుంటారు. అక్కడికి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పిస్తారు.