న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ అప్పుడే ట్విట్టర్‌లో దూసుకుపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసి నిమిషాలు కూడా గడవకముందే ఆయన ట్విట్టర్ ఖాతాకు ఏకంగా 3.5మిలియన్ల ఫాలోవర్స్ చేరుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'(@rashtrapatibhvn) పేరుతో ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. అయితే, నిమిషాల్లోనే ఆయనకు ఫాలోవర్స్ లక్షల్లో పెరిగిపోవడం గమనార్హం.
ఆయన 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు కూడా. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీతో సహా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, కోవింద్ ఖాతాకు మాత్రం గతంలో ఏ రాష్ట్రపతికి రానంత వేగంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్ మంగళవారం రామ్‌నాథ్‌తో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.