న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా బిహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్ ముఖర్జీ... కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేత కోవింద్. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా రాజ్‌ఘాట్ చేరుకుని, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. దేశప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేత అద్వానీ, రెండు తెలుగురాష్ట్రల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, పౌర, సైనిక విభాగాల ముఖ్యాధికారులు హాజరు అయ్యారు. కోవింద్ ప్రమాణం చేశాక సాయుధ బలగాలు 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించాయి. ఈ కార్యక్రమం ముగిశాక కోవింద్ రాష్ట్రపతి భవనానికి చేరుకున్నాక, అక్కడికి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.