
ఘనంగా ప్రథముడి ప్రమాణం
14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌నాథ్ కోవింద్
► హాజరైన అధికార, విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు
► భిన్నత్వమే భారతదేశ విజయంలో కీలకం: కోవింద్
న్యూఢిల్లీ: దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ (71) ప్రమాణ స్వీకారోత్సవం సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కోవింద్‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయించారు
. న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి, రాజకీయ నాయకుడిగా ఎదిగిన కోవింద్.. రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టిన మొదటి బీజేపీ నేతగా, రెండో దళిత వ్యక్తిగా నిలిచారు. ప్రమాణస్వీకారం అనంతరం కొత్త రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తూ.. భారతదేశ విజయ ప్రస్థానంలో భిన్నత్వమే అత్యంత కీలకమన్నారు. విభిన్న సంస్కృతులు, భాషలు, జీవన విధానాలున్నా అందరం ఐక్యంగా ఉన్నామని తొలి ప్రసంగం చేశారు. అనంతరం సెంట్రల్ హాల్లోని అధికార, విపక్ష నేతలు కోవింద్‌కు అభినందనలు తెలిపారు.
మధ్యాహ్నం 12.15 గంటలకు...
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోవింద్‌ను అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. వాహన శ్రేణితో పాటు అశ్వదళం వెంట రాగా దారి పొడవునా త్రివిధ దళాలకు చెందిన జవాన్లు సైనిక వందనం సమర్పించారు. పార్లమెంట్ భవనం ఐదో గేటు వద్ద ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్‌లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌కు స్వాగతం పలికి సెంట్రల్ హాలుకు తోడ్కొని వెళ్లారు.
జాతీయ గీతాలాపన తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ గెలుపొందినట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనను కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి చదివి వినిపించారు. అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌తో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణస్వీకారం చేయించారు. వెంటనే 21 తుపాకులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతి కోవింద్‌ను.. ప్రణబ్ తన ఆసనంలో కూర్చోబెట్టారు. అనంతరం కోవింద్ ప్రసంగిస్తూ.. కుగ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన తాను రాష్ట్రపతి భవన్‌కు ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేశానని గుర్తుచేసుకున్నారు.
అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పించాలి: కోవింద్
ప్రమాణస్వీకారం అనంతరం రాష్ట్రపతి కోవింద్ మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ ఎంతో అవసరమన్నారు. ‘ఒక చిన్న గ్రామంలో మట్టి ఇంట్లో పుట్టి పెరిగాను. రాష్ట్రపతి భవన్ వరకూ నా ప్రయాణం ఎంతో సుదీర్ఘం. ఈ ప్రయాణం దేశానికి, సమాజానికి ఒక విషయాన్ని గట్టిగా నొక్కిచెపుతుంది. అవరోధాల సమయంలో రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న ప్రాథమిక సూత్రాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల్నే అనుసరించాను. భవిష్యత్తులో ఈ పంథాలోనే కొనసాగుతాను.
నా ముందు రాష్ట్రపతులుగా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్, ఎస్.రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్‌కలాం, ప్రణబ్ ముఖర్జీతో పాటు మహాత్మా గాంధీ నేతృత్వంలోని వేలాది మంది దేశభక్తుల పోరాట ఫలితమే దేశ స్వాతంత్య్ర ఫలం. ఈ నేతలు కేవలం రాజకీయ స్వేచ్ఛ ఉంటే చాలని భావించలేదు. కోట్లాదిమంది దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని నమ్మారు. అణగారిన వర్గాలకు చెందిన ప్రతీ చివరి వ్యక్తి, మహిళకు అవకాశాలు చేరాల్సిన అవసరముంది. ఈ దేశం అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు, మతాలు, భాషలు, సంస్కృతులు, జీవన విధానాలు కలిగి ఉన్నా భిన్నత్వమే మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. జాతిగా మనం ఎంతో సాధించినా.. మరింత వేగంగా, గొప్పగా, అవిశ్రాంతంగా శ్రమించా ల్సి ఉంది’ అని కోవింద్ ఉద్ఘాటించారు.
సంప్రదాయబద్ధంగా... అట్టహాసంగా
♦ దేశ రాజ్యాంగ కొత్త అధినేత మార్పు ప్రక్రియ మంగళవారం ఉదయం సంప్రదాయబద్ధంగా మొదలైంది. రాష్ట్రపతి సైనిక కార్యదర్శి మేజర్ జనరల్ అనిల్ ఖోస్లా కాన్వాయ్‌తో అక్బర్ రోడ్డులోని కోవింద్ నివాసానికి వెళ్లారు. కోవింద్‌ను, ఆయన సతీమణి సవితను రాష్ట్రపతి భవన్‌కు ఆయన ఆహ్వానించారు.
♦ రాష్ట్రపతి భవన్‌లో కోవింద్ దంపతులకు ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానం పలికారు. ఇద్దరూ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో సైనిక వందనం స్వీకరించారు. ప్రెసిడెంట్ బాడీగార్డుల(పీబీజీ) నుంచి ప్రణబ్ ముఖర్జీ చివరి సారిగా సైనిక వందనం అందుకున్నారు.
♦ అక్కడి నుంచి ఇద్దరూ రైసినా హిల్స్ దిగువ భాగంలో ఉన్న పార్లమెంట్ సెంట్రల్ హాలుకు బయలుదేరారు. అధికారిక వాహనంలో కుడివైపున ప్రణబ్, ఎడమవైపున కోవింద్ కూర్చోగా కాన్వాయ్ ముందుకు కదిలింది. రాష్ట్రపతి అశ్వదళం లాంఛన దుస్తుల్లో కాన్వాయ్‌ను అనుసరించింది. దారి మధ్యలో త్రివిధ దళాలకు చెందిన 1000 మంది జవాన్లు ‘హజార్ సలాం’ చేశారు.
♦ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం ముగిశాక ప్రణబ్, కోవింద్‌లు రాష్ట్రపతి భవన్‌కు బయల్దేరారు. ఈసారి వారిద్దరు ఒకే కారులో ప్రయాణించినా సీట్లు మారాయి. ప్రణబ్ ముఖర్జీ ఎడమవైపున కూర్చుంటే.. దేశ నూతన రాష్ట్రపతి కోవింద్ కుడివైపున ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నాక సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. గుర్రపు బగ్గీలో కోవింద్ కొద్దిసేపు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో తిరిగారు. కొత్త రాష్ట్రపతికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. రాష్ట్రపతి భవనం గురించి కోవింద్‌కు ప్రణబ్ ముఖర్జీ వివరించారు. అనంతరం ప్రణబ్‌ను తీసుకుని కోవింద్ రాష్ట్రపతి భవన్ బయటకు వచ్చారు. అధికారిక వాహనంలో ప్రణబ్ కొత్త నివాసం 10, రాజాజీ మార్గ్ వద్ద ఆయనను దిగబెట్టారు. అక్కడి నుంచి కోవింద్ తిరిగి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
కోవింద్‌కు కొత్త ట్వీటర్ అకౌంట్, వెబ్‌సైట్
నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కేటాయించిన కొత్త ట్వీటర్ అకౌంట్ @ RashtrapatiBhvn పనిచేయడం ప్రారంభించింది. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత ఆయన చేసిన ప్రసంగం విషయాలను ఆ ట్వీటర్ హ్యాండిల్‌లో చూడొచ్చు. పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ వినియోగించిన అధికార ట్వీటర్ చరిత్రను @ POI13 అనే హ్యాండిల్ పేరిట రికార్డుల్లో భద్రపరిచారు. రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా పునర్వ్యవస్థీకరించి అందుబాటులోకి తెచ్చారు.
మోదీ–మమత పలకరింపులు
♦ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి ప్రవేశించగానే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు బల్లలు చరిచి స్వాగతం పలికారు.
♦ మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాని దేవెగౌడలతో కలసి ప్రధాని మోదీ ముందు వరసలో కూర్చున్నారు. కోవింద్ ప్రమాణం చేసిన తరువాత పాటిల్ హాల్‌లోకి రావడం ఆశ్చర్యం కలిగించింది.
♦ కార్యక్రమం ముగిసిన తరువాత బయల్దేరబోతూ మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని చూసి చేయి ఊపారు. బదులుగా మమత కూడా నమస్తే చెప్పా రు. ఇటీవల తారస్థాయికి చేరిన తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
♦ ఎంతో మంది ప్రముఖులు హాజరైనా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసిన తరువాత పలువురు బీజేపీ ఎంపీలు ఆయన చుట్టూచేరి కరచాలనం చేశారు. మరికొందరు ఆయన పాదాలకు నమస్కరించారు.
♦ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌లు ఎడమొహం పెడమొహంగా వ్యవహరించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నా మాట్లాడుకున్నట్లయితే కనిపించలేదు.
♦ లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన నలుగు రు ఎంపీలతో కలసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ చివరి వరసలో కూర్చున్నారు.
♦ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తన పక్కనే కూర్చున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చాలాసేపు ముచ్చటించారు.
♦ సీఎంలలో...కె.చంద్రశేఖర్ రావు(తెలంగాణ), చంద్రబాబు (ఆంధ్రప్రదేశ్), ఫడ్నవీస్(మహారాష్ట్ర), పళనిస్వామి (తమి ళనాడు), వసుంధర రాజె(రాజస్తాన్), శర్బానంద సోనోవాల్(అస్సాం), విజయ్ రూపానీ(గుజరాత్), శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), రమణ్‌సింగ్(ఛత్తీస్‌గఢ్), మనోహర్‌లాల్ ఖట్టర్(హరియాణా), పీకే చామ్లింగ్(సిక్కిం), పెమా ఖండూ (అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్)లు కార్యక్రమానికి హాజరయ్యారు.