- సుప్రీంలో తెలంగాణ వాదన
- బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఏపీ మా ఆకాంక్షలను వినిపించలేదని వెల్లడి
- కేటాయింపులు మళ్లీ చేయొద్దన్న మహారాష్ట్ర ప్రభుత్వం
- తెలంగాణ ఎస్‌ఎల్‌పీని విచారణకు స్వీకరించిన ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల కేటాయింపు లు మళ్లీ మొదట్నుంచీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. గతవారం ఈ పిటిషన్ జస్టిస్ సుధాంశుజ్యోతి ముఖోపాధ్యా య, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అని పేర్కొంటూ.. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు సూచించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కేసు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది.
తొలుత తెలంగాణ తరపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కృష్ణమూర్తి స్వామి పిటిషన్‌లోని విజ్ఞాపనను ధర్మాసనానికి వివరించారు. ‘‘కృష్ణా జలాల కేటాయింపులు జరుపుతూ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డును తాము చెప్పేవరకు గెజిట్‌లో నోటిఫై చేయరాదని న్యాయస్థానం కేం ద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏపీ విభజన నేపథ్యంలో జూన్ 2నుంచి తెలంగాణ ప్రత్యే క రాష్ట్రంగాఉంది.
ఆంధ్రప్రదేశ్ పిటిషన్‌తో సంబంధం లేకుండా ఇప్పుడు మేం స్వతంత్రంగా పిటిషన్ దాఖలు చేశాం. ఎందుకంటే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తమ వాదనలు వినిపించినప్పుడు మా ప్రాంత ఆకాంక్షలు, అవసరాలు వ్యక్తపరచలేదు. అందువల్ల కృష్ణా జలాల కేటాయింపులు మళ్లీ జరపాలని మా అ భ్యర్థన’’ అని విన్నవించారు. మహారాష్ట్ర తరపు న్యాయవాది అంధ్యార్జున తన వాదనలు విని పిస్తూ.. ‘ ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో వివాదం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యే ఉన్నం దున అన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
దీనిపై తెలంగాణ న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇదే అంశంలో ఏపీ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అవార్డును గెజిట్‌లో నోటిఫై చేయాలన్న మహారాష్ట్ర పిటిషన్ పెండింగ్‌లో ఉంది. అన్ని అంశాలను మరోసారి పరిశీలించాలన్నదే మా అభ్యర్థన.. ప్రస్తుతం మా సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా వారంపాటు విచారణనువాయిదా వేయగలరని కోరుతున్నాం’’ అని విన్నవించారు. దీంతో ధర్మాసనం ఈ కేసును డిసెంబర్ 1కి వాయిదా వేసింది.