శాస్త్రి మరణం మిస్టరీనా..?
1965 భారత్-పాక్ యుద్ధం తర్వాత మన దేశానికి పెద్ద కుదుపు లాల్ బహదూర్ శాస్త్రి మరణం. ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో ఆ యుద్ధాన్ని గెలుచుకు వచ్చిన మన ప్రధాని ఆకస్మిక మరణం పౌరులందరినీ కలచివేసింది. దాయాదిపై విజయానందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే ఆయన కన్నుమూయడం భారతీయులను కంటతడి పెట్టించింది. దేశం కాని దేశంలో అత్యంత నాటకీయంగా మరణించడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. ఆయన మరణానికి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు నేటికీ మన మెదళ్లను దొలిచేస్తాయి. కానీ, సమాధానాలే దొరకవు!
భారత రెండో ప్రధానిగా ఖ్యాతి గడించిన లాల్ బహదూర్ శాస్త్రి.. ఇండో-పాక్ యుద్ధం తర్వాత యూఎస్‌ఎస్‌ఆర్‌లోని తాష్కెంట్‌కు వెళ్లాల్సివచ్చింది. దాయాదుల మధ్య శాంతి ఒప్పందం కోసం సోవియెట్ దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1966 జనవరి 10న ఒప్పందం మీద సంతకాలు కూడా చేశారు. దీంతో అధికారికంగా యుద్ధం ముగిసినట్టైంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ తర్వాతి రోజే తాష్కెంట్‌లోని తన గదిలో శాస్త్రి మరణించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని సోవియెట్ అధికారులు స్పష్టం చేశారు. కానీ, ఇందులో నిజమెంత..? అప్పటినుంచే బోలెడన్ని అనుమానాలు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఏ విషయంలోనూ స్పష్టతనివ్వని మన ప్రభుత్వం వాటిని మరింత పెంచింది.
లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి సంబంధించి రాజ్‌నారాయణ్ విచారణ కమిటీ ఎలాంటి ముగింపునూ ఇవ్వలేదు. అంతేకాదు, ఈ విచారణ కమిటీ గురించి ఒక్క పత్రమూ మన పార్లమెంటు లైబ్రరీలో దొరకలేదు. దీంతో నిజంగానే కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించలేదా? లేక, వాటిని ఎవరైనా దాచిపెట్టడమో, ధ్వంసం చేయడమో చేశారా అన్నది చాలామంది వ్యక్తపరిచే మొదటి సందేహం!
మరణించిన వ్యక్తులకు పోస్టుమార్టం చేయడం అనేది ఆనవాయితీ. కానీ, శాస్త్రి మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. సోవియెట్ యూనియన్‌లో పోస్టుమార్టం జరపకుండానే మనదేశానికి తీసుకొచ్చారు. అయితే, శాస్త్రి భార్య లలిత వాదన మరోలా ఉంది. ఆయన మృతదేహం నీలిరంగులోకి మారిందని, శరీరంపై కోసిన గాయాలు ఉన్నాయని ఆమె చెప్పారు. అంటే.., పోస్టుమార్టం జరిపినప్పటికీ ఆ విషయాన్ని దాచాలని చూశారా? ఒకవేళ చేసినట్టైతే ఆ రిపోర్టులు ఏమయ్యాయి?
శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్.ఎన్.చుఘ్ కథనం ప్రకారం.. శాస్త్రి అత్యంత ఆరోగ్యంగా ఉండేవారు. అంతేకాదు, గతంలో ఆయనకు హృదయ సంబంధ జబ్బులే ఉండేవి కాదు. అలాంటిది ఒక్కసారిగా గుండెపోటుతో ఎలా మరణిస్తారు? ఒకవేళ ఆయన మీద విష ప్రయోగం జరిగిందా..? మృతదేహానికి పోస్టుమార్టం జరపలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, శరీరంపై నీలిరంగు మచ్చలు కనిపించడం ఈ అనుమానానికి ఊతమిచ్చాయి.
లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో మరణించిన రాత్రి ఆయనతో పాటు ఇద్దరు ఉన్నారు. వారే డాక్టర్ ఆర్.ఎన్.చుఘ్, వ్యక్తిగత సహాయకుడు రామ్‌నాథ్‌లు. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణించి, విచారణకు హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ సంఘం 1977లో కోరింది. అయితే, విచిత్రంగా డాక్టర్ చుఘ్ ట్రక్ ఢీకొట్టడంతో మరణించగా, రామ్‌నాథ్ కూడా కార్ ఢీకొట్టిన ఘటనలో రెండు కాళ్లూ కోల్పోయాడు. అంతేకాదు, అతడి జ్ఞాపకశక్తి కూడా పూర్తిగా దెబ్బతింది. శాస్త్రి కుటుంబ సభ్యుల ప్రకారం, ‘ఎన్నాళ్లుగానో ఈ బరువును మోస్తున్నా. ఇక దింపేసుకుంటా’ అని విచారణకు వెళ్లేముందు రామ్‌నాథ్ వారితో చెప్పాడు.
గ్రెగరీ డగ్లస్ అనే జర్నలిస్టు అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఏజెంట్ రాబర్ట్ క్రోలేతో టెలిఫోన్‌లో జరిపిన సంభాషణలను ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ‘కన్వర్జేషన్స్ విత్ క్రో’ అనే ఈ పుస్తకంలో నమ్మశక్యం కాని నిజాలను పొందుపరిచాడు గ్రెగరీ. భారత శాస్త్రవేత్త హోమీ భాభాతో పాటు, శాస్త్రి హత్యకూ సీఐఏనే ప్రణాళికలు వేసిందని, వారిని తామే హత్య చేశామని రాబర్ట్ పేర్కొన్నాడు. అణు పరీక్షల విషయంలో శాస్త్రి దూకుడు చూపడం, రష్యాతో చనువుగా వ్యవహరించడం వల్లే ఇలా చేయాల్సివచ్చిందని చెప్పాడు.
మరణించిన రోజు రాత్రి శాస్త్రి గదిలోకి వెళ్లిన రష్యా వంటవాడిపై సైతం అనుమానాలున్నాయి. భారత ప్రధానికి విషం పెట్టి చంపగలిగే అవకాశం అతనికే ఉందని భావించి తొలుత అతడిని అరెస్టు కూడా చేశారు. కానీ, శాస్త్రి గుండెపోటుతో మరణించారని ప్రకటించడంతో అధికారులు అతడిని వదిలేశారు.
ఇక, శాస్త్రి మరణం మిస్టరీకి సంబంధించి ఫైళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో గందరగోళానికి కారణమైంది. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఢిల్లీ పోలీసులు.. ఇలా వేర్వేరు శాఖలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. చివరకు ఎవరిదగ్గరా సమాచారం లేదని తేలింది. సమాచార హక్కు చట్టం ఉపయోగించి విషయం రాబట్టడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ ఘటనకు సంబంధించి ఒకే ఒక్క ఫైలు తమ దగ్గర ఉందనీ, కానీ అది బయటపడితే విదేశీ వ్యవహారాలకు భంగం కలుగుతుందనీ కేంద్రం పేర్కొంది. చివరకు ఆర్టీఐ పరిధి నుంచి కూడా దాన్ని తప్పించింది. దేశ చరిత్రలోనే గొప్ప ప్రధానుల్లో ఒకరిగా నిలిచిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనుమానాలు చాలానే ఉన్నాయి. సమాధానాలు కరవైనప్పుడు అవి మిస్టరీలుగానే మిగిలిపోతాయి!