రాంచీ: బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(69) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను ఇక్కడి రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చేర్చారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లాలూ డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ ఆరోగ్యస్థితిని కార్డియాలజీ విభాగం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దాణా కుంభకోణంలో దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.
తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హుటాహుటిన పట్నా నుంచి రాంచీకి వచ్చారు. రిమ్స్‌కు వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, జార్ఖండ్ ఆర్జేడీ అధ్యక్షుడు అన్నపూర్ణ దేవి, వందలాది పార్టీ కార్యకర్తలు రిమ్స్‌కు తరలివచ్చారు. తమ నాయకుడిని చూసేందుకు అనుమతించడం లేదని అన్నపూర్ణ దేవి మీడియాతో చెప్పారు. లాలూ అనారోగ్యం గురించి తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment